||మహేశ్వరం కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు .. ఇండిపెండెంట్‌గా పారిజాత పోటీ?||
(రంగారెడ్డి, ఈవార్తలు, అక్కినేపల్లి పురుషోత్తంరావు)
మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా సెగలు పుట్టించింది. నిన్న మొన్నటి వరకు ఆశావహుల జాబితాలో కనిపించిన డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, దీపభాస్కర్ రెడ్డి పేర్లు హఠాత్తుగా మాయమై పీసీసీకి దరఖాస్తు చేసుకున్న కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పేరు ఊహించని రీతిలో తెరపైకి వచ్చింది. ఏకంగా టికెట్ దక్కింది. దీంతో పార్టీ శ్రేణులు హతాశ్యులయ్యాయి. ఇదంతా అధికార భారత రాష్ట్ర సమితితో కుదిరిన లోపాయికారి ఒప్పందంలో భాగమేనని వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి విజయం సాధించిన సబితాఇంద్రారెడ్డి కాంగ్రెస్‌ను వీడి అధికార పార్టీలో చేరినప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు పార్టీని భుజానికి ఎత్తుకొని తిరిగిన దీపాభాస్కర్‌రెడ్డికి కాకుండా నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఖరారు చేయడాన్ని పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. పార్టీ కోసం పనిచేసే నాయకులను కాదని, కొత్తవారిని నిలపాలనుకొంటే పార్టీ కోసం తామెందుకు పనిచేయాలని నిలదీస్తున్నాయి. గత సంవత్సరం జూన్‌లో అధికార పార్టీని వదిలిపెట్టి టికెట్ ఇస్తారన్న హామీతో కాంగ్రెస్ పార్టీలో చేరిన పారిజాత నరసింహారెడ్డి నాటి నుంచి నేటి వరకు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రతి ఇంటిని తడుతూ, పార్టీని చెప్పుకోదగ్గ రీతిలో బలోపేతం చేశారు. అలాంటి నేతకు కాకుండా శంకరపల్లి వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఏమిటి? అని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇండిపెండెంట్‌గా పోటీ చేయండి.. గెలిపిస్తాం అంటున్న కార్యకర్తలు
పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోయినా సరే మహేశ్వరం నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్గా పోటీ చేయాలని పారిజాత నరసింహారెడ్డి, దీప భాస్కర్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాలుగైదు వందల మంది అల్కాపురిలోని దీపాభాస్కర్‌రెడ్డి, బాలాపూర్‌లోని పారిజాత నర్సింహారెడ్డి నివాసాలకు చేరుకొని తమ డిమాండ్‌ను వారి ముందు ఉంచారు. పార్టీ పెద్దల తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా? లేక మరో పార్టీకి మారుతారా? ఎదురు చూడాల్సిందే.