జర్నలిస్టులకు షాక్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. రెండో సారి గెలిస్తేనే ఇళ్ల పట్టాలు..

తెలంగాణ జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వస్తాయని ఎంతో ఆశించినా.. నిరాశే ఎదురు కానుంది. ఇప్పట్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేది లేదని ఇన్‌డైరెక్ట్‌గా స్పష్టం చేశారు.

cm revanth reddy
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణ జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వస్తాయని ఎంతో ఆశించినా.. నిరాశే ఎదురు కానుంది. ఇప్పట్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేది లేదని ఇన్‌డైరెక్ట్‌గా స్పష్టం చేశారు. సోమవారం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల నియామకపత్రాల అందజేత సందర్భంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మాట్లాడుతూ.. ‘మేము అధికారంలోకి రాగానే మొదటి విడత జర్నలిస్టుల ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశాం. రెండో విడత కూడా ఇస్తాం. రెండోసారి అధికారంలోకి రాగానే అందజేస్తాం. జర్నలిస్టులు కూడా సహకరించాలి. వారికీ సోషల్ రెస్పాన్స్ బులిటీ ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న జర్నలిస్టులు షాక్ కావడం గమనార్హం.

వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న మొదటి విడత ఇళ్ల స్థలాలు.. వైఎస్సార్ హయాంలో ప్రకటించినవే. దాదాపు 16 ఏళ్ల పాటు కోర్టుల్లో కేసు నడవటంతో జేఎన్‌జే సొసైటీ జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు దక్కలేదు. సుప్రీం కోర్టులో అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రత్యేక చొరవతో.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి గత ఏడాది మార్గం సుగమం అయ్యింది. అయితే, అప్పటికి రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దాన్ని క్లియర్ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి.. అధికారంలోకి రాగానే ఆ సొసైటీలోని జర్నలిస్టులకు పట్టాల పంపిణీకి ఓకే చెప్పింది.

అయితే.. ఇప్పటికీ ఆ జర్నలిస్టుల చేతికి ఇళ్ల స్థలాలు అందలేదు. టెక్నికల్ అంశాలు అని చెప్తూ కాలయాపన చేస్తున్నారు తప్ప ఆ జర్నలిస్టుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పడలేదు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చొరవతో తమకూ ఇళ్ల స్థలాలు వస్తాయని ప్రస్తుతం జర్నలిస్టులు ఆశపడ్డారు. పలువురు సొసైటీలు ఏర్పాటు చేసి.. సభ్యత్వం కూడా తీసుకుంటున్నారు. కానీ.. సీఎం రేవంత్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా వారి ఆశలను అడియాసలు చేసినట్లైంది. రెండోసారి అధికారంలోకి వచ్చాక చేస్తామనడం అంటే.. ఆశలు వదులుకోవడమే అని పలువురు జర్నలిస్టులు వాపోతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్