తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు విడతల రుణమాఫీని ప్రభుత్వం పూర్తి చేసింది. మూడో విడత రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల వరకు రైతులకు రుణాలను మాఫీ చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలను చేపట్టింది. మూడో విడత రుణమాఫీకి సంబంధించిన నిధులను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో విడుదల చేయనున్నారు.
రైతు రుణమాఫీ
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు విడతల రుణమాఫీని ప్రభుత్వం పూర్తి చేసింది. మూడో విడత రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల వరకు రైతులకు రుణాలను మాఫీ చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలను చేపట్టింది. మూడో విడత రుణమాఫీకి సంబంధించిన నిధులను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో విడుదల చేయనున్నారు. ఆ వెంటనే రైతులు ఖాతాల్లో నిధులు జమ కానున్నాయని అధికారులు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని బుధవారం హైదరాబాద్ కు వచ్చారు. గురువారం హైదరాబాదులో ఆగస్టు 15 వేడుకల్లో పాల్గొని తర్వాత హెలికాప్టర్లో వైరాకు పయనమవుతారు. అక్కడ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభలో రుణమాఫీని ప్రకటించనున్నారు. రుణమాఫీకి అర్హమైన ఖాతాలు మొత్తంగా 32.5 లక్షలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులను కేటాయించింది. జూలై 18న మొదటి విడతగా లక్ష వరకు రుణమాఫీ చేసింది. జూలై 30న అసెంబ్లీ ప్రాంగణంలోనే రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసింది.
రెండో విడతలో లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమున్న రైతు కుటుంబాలకు మాఫీ చేసింది. మూడో విడత రైతు రుణమాఫీని గురువారం ప్రభుత్వం చేయనున్నది. మూడో విడతలో భాగంగా 1.50 లక్షలు నుంచి రెండ్ లక్షలు వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయనున్నారు. రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. మూడో విడతలో 14.45 లక్షల మంది రైతులకు రుణమాఫీ ద్వారా మేలు చేకూరనుంది. మూడు విడతల్లో రుణమాఫీకి అవసరమైన నిధులను ప్రభుత్వం పూర్తిగా సమకూర్చుకుంది. ఇప్పటికే రెండు విడతలకు సంబంధించిన నిధులను విడుదల చేయగా, మూడో విడతకు సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం సిద్ధం చేసుకుని రైతులకు జమ చేయబోతుంది. దీనివల్ల లక్షలాది మంది రైతులకు మేలు చేకూరనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఎగురువేనున్నారు. అదేరోజు ఉదయం మిగిలిన 32 జిల్లాల్లో జండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఏ ఏ జిల్లాలో ఏ ప్రజాప్రతినిధి జెండాను ఎగురువేస్తారనేది పేర్కొంటూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.