ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలకు కీలక బాధ్యతలను అప్పగించారు. ఢిల్లీలో ఉంటున్న ఎంపీలు చేయాల్సిన పనులపై ఆయన దిశా, నిర్ధేశం చేశారు. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్న తరుణంలో చంద్రబాబు నాయుడు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు, ఇతర అనుమతులు తీసుకురావడంపై ఎంపీలు దృష్టి సారించాలని సూచించినట్టు తెలిసింది.
ఎంపీలతో సమావేశమైన సీఎం చంద్రబాబు నాయుడు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలకు కీలక బాధ్యతలను అప్పగించారు. ఢిల్లీలో ఉంటున్న ఎంపీలు చేయాల్సిన పనులపై ఆయన దిశా, నిర్ధేశం చేశారు. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్న తరుణంలో చంద్రబాబు నాయుడు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు, ఇతర అనుమతులు తీసుకురావడంపై ఎంపీలు దృష్టి సారించాలని సూచించినట్టు తెలిసింది. వివిధ శాఖలకు చెందిన సమాచారాన్ని తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర మంత్రులను వెంటబెట్టుకుని ఆయా శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కలవాలని ఆదేశించారు. కేంద్రంలోని మంత్రిత్వశాఖలు నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయాల్సిన కృషిపై ప్రత్యేకంగా సూచనలను చంద్రబాబు చేశారు.
అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై ఎక్కువ ఆధారపడి ఉందని, అందుకు అవసరమైన సహకారాన్ని పొందడంలో ఎంపీలు కీలకంగా వ్యవహరించాలన్నారు. కేంద్ర ప్రయోజిత పథకాలకు ఎక్కువగా నిధులు వచ్చే అవకాశం ఉందని, వాటిని నిర్లక్ష్యం చేయవద్దని ఈ సందర్భంగా ఎంపీలకు చంద్రబాబు నాయుడు సూచించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో వివిధ ప్రాజెక్టులకు భూములు కేటాయింపునకు సంబంధించిన పెండింగ్ అంశాలతోపాటు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను మళ్లీ గాడిన పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపైనా దిశానిర్ధేశం చేశారు. కేంద్ర సంస్థలు ఏవైనా రాష్ట్రంలో పెడితే వాటికి తక్షణమే భూములు కేటాయిస్తామన్న విషయాన్ని ఎంపీలకు వెల్లడించారు. ఇక, ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా చేస్తానని చెప్పిన విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా చంద్రబాబు ఎంపీలతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది.