||బల్వంతాపూర్‌లో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్||
ఈవార్తలు, జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లాలో దశాబ్ది ఉత్సవాలు ముందే ప్రారంభమయ్యాయి. జిల్లాలోని మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలోని మహిళా సంఘాల నేతృత్వంలో బతుకమ్మలతో మహిళలు ఊరంతా ఊరేగింపు చేపట్టగా, ఎమ్మెల్యే రవిశంకర్.. గ్రామంలో రూ.3.29 కోట్ల నిధులతో సీసీ రోడ్డు, బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు రజకుల కోసం రజకసంఘం భవనానికి, యాదవుల కోసం యాదవుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామపంచాయతీ భవనం వద్ద రోడ్డు పనుల కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రారంభించి, రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మంజూరైన మహిళా సంఘం భవనాన్ని పూర్తి చేసేందుకు మిగులు పనుల నిధులను మంజూరు చేస్తూ, ఆ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నదని వెల్లడించారు. గ్రామాల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీరు అందిస్తున్నామని వివరించారు. హరితహారం, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని, మిషన్ కాకతీయ ద్వారా పూడికతీత పనులు చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రామ్మోహన్‌రావు, సింగిల్ విండో చైర్మన్ ముత్యాల రామలింగారెడ్డి, మల్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మిట్టపెల్లి సుదర్శన్, శ్రీరాజరాజేశ్వరి గ్రామైక్య సంఘం మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.