||చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్||
భారత్ నిర్వహిస్తున్న జీ20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ గైర్హాజరు కానున్నారు. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయనకు బదులుగా చైనా ప్రధాని లీ కియాంగ్ ఈ సమావేశానికి రానున్నట్లు వెల్లడించింది. ‘భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరిగే జీ20 సదస్సులో లీ కియాంగ్ పాల్గొంటారు. చైనా బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు’ అని చైనా విదేశాంగ ప్రతినిధి మావోనింగ్ వివరించారు. అయితే, జీ 20 సదస్సుకు జిన్‌పింగ్ గైర్హాజరుపై ఎలాంటి కారణం వెల్లడించలేదు. 2021లో ఇటలీలో నిర్వహించిన జీ20 సదస్సుకు కూడా జిన్‌పింగ్ హాజరుకాలేదు. కొవిడ్ కారణంగా చూపుతూ సదస్సుకు రాలేదు.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం నిర్వహించబోయే జీ20 సదస్సుకు జిన్‌పింగ్ గైర్హాజరు కావటానికి అరుణాచల్ ప్రదేశ్ కారణం కావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల చైనా తన అధికారిక మ్యాప్‌లో భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్ భూభాగాలను తనవిగా చూపింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే జిన్‌పింగ్ జీ20 సదస్సుకు హాజరు కావటం లేదన్న అనుమానం కలుగుతోందని విశ్లేషకులు చెప్తున్నారు.