||పద్మశాలి చలో కోరుట్ల సభ విజయవంతం||
ఒక్కో దారాన్ని వడికినట్టు..
ఒక్కో నూలు పోగు పేర్చినట్టు..
మగ్గం చకచకా పరుగులు తీసినట్టు..
ఒక్కొక్క పద్మశాలి.. ఒక్కో పిడికిలై..
ఒక్కో అడుగు వేస్తూ ముందుకు కదిలారు..
రాజ్యాధికార సాధనలో మేమెందుకు తక్కువ?
కొందరికే అధికారామా? అని ప్రశ్నిస్తూ..
జై పద్మశాలి! అంటూ సింహ గర్జన చేశారు..
సమరశంఖం పూరిస్తూ విజయనాదం మోగించారు..
పద్మశాలీలంతా చలో కోరుట్ల అని గళమెత్తి,
కోరుట్ల పట్టణాన్ని ‘నేత’ వనం చేశారు..
సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక,
ఆంధ్రప్రదేశ్ నుంచీ పద్మాశాలీలు తరలివచ్చారు.
ఈవార్తలు, కోరుట్ల: ఇసుకేస్తే రాలనంత జనం.. ఎన్నడూ చూడని ఐక్యత.. చూస్తే రెండు కండ్లూ సరిపోవంటే నమ్మలేం.. కోరుట్లలో ఆదివారం చోటుచేసుకున్న దృశ్యాలు వారెవ్వా! అనేలా కనిపించాయి. రాజ్యాధికార సాధన కోసం పద్మశాలీయులు నిర్వహించిన పద్మశాలి యుద్ధభేరి విజయవంతం అయ్యింది. చరిత్రలో ఎన్నడూ ఈ స్థాయిలో పద్మశాలీల ఐక్యత చూపిన సందర్భాలు లేవంటే ఆదివారం నాటి సభ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అర్థం చేసుకోవచ్చు. పార్టీలకు అతీతంగా నాయకులు కూడా తరలివచ్చారు. ఏపీ పద్మశాలీ సంఘం కూడా చలో కోరుట్లకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పద్మశాలీలు తండోపతండాలుగా సభకు హాజరయ్యారు. జై పద్మశాలీ! జై మార్కండేయ!! నినాదాలతో సభాప్రాంగణం మార్మోగింది. సభకు హాజరైన పద్మశాలీ పెద్దలు.. పద్మశాలీలకు అసెంబ్లీలో పది స్థానాలు, శాసన మండలిలో 5 స్థానాలు కేటాయించాలని అన్ని పార్టీలను డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమంలో పద్మశాలీల పాత్ర ఎనలేనిదని, సకల జనుల సమ్మెలో మగ్గాలు, రాట్నాలతో రోడ్లపై నిరసన చేపట్టారని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం సమన్వయకర్త రామ శ్రీనివాస్ అన్నారు. అయితే, రాష్ట్రంలో రాజకీయంగా పద్మశాలీలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన పద్మశాలీ బంధువులను చూస్తుంటే ఆనందం ఉప్పొంగుతోందని, ఇదే ఐక్యతతో రాజ్యాధికారం దిశగా అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పద్మశాలీల జనాభా ఎక్కువగా ఉందని, దానికి తగ్గట్టు అన్ని పార్టీలు పద్మశాలీలకు రాజకీయ అవకాశం కల్పించాలన్నారు.
పద్మశాలీ సోదరుడు, మధ్యప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పరికిపండ్ల నరహరి మాట్లాడుతూ చట్టసభల్లో ప్రాతినిధ్యం సాధించుకోవడం ద్వారా పద్మశాలీలు తమ అస్తిత్వాన్ని చాటాలని అన్నారు. నరాలు పోగులుగా చేసి, రక్తాన్ని రంగుగా మార్చి, గుండెను కండెగా చేసి బతుకుతున్న నేతన్నలు తమ బతుకుల బాగు కోసం రాజ్యాధికారం అవసరం అని తెలిపారు.
జగిత్యాల జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజ్యాధికారం దిశగా వేస్తున్న అడుగులకు ఈ సభ తార్కాణంగా నిలుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. లక్ష మందిని సభకు రప్పించాలని అనుకోగా, అంతకుమించి స్వచ్ఛందంగా సభకు తరలివచ్చారని వెల్లడించారు. ఇదే ఐక్యతతో ముందుకు సాగుదామని పద్మశాలీ సోదర, సోదరీమణులకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఏపీలోని కర్నూల్ ఎంపీ డాక్టర్ సంజయ్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ బసవ లక్ష్మీనర్సయ్య, నాయకులు గడ్డం మధు, భోగ శ్రావణి, జక్కుల ప్రసాద్, ముల్క మల్లయ్య, కస్తూరి విశ్వనాథం, బొమ్మకంటి గంగాధర్, కొండబత్తిని గంగాధర్, వీరబత్తిని గంగాధర్, బుదారపు గంగమల్లు, బొద్దుల మహేందర్, కొండబత్తిని నర్సయ్య, పెంట సురేష్, అల్లె శంకర్, భూర్ల గణేశ్, అడ్లగట్ట లింగయ్య సహా రాష్ట్ర నలుమూలల నుంచి పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు.