తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బుద్ధా వెంకన్న ఏది మాట్లాడిన కాస్త ఘాటుగానే, సెన్సేషన్ సృష్టించే విధంగా మాట్లాడుతుంటారు. తాజాగా అటువంటి వ్యాఖ్యలనే వెంకన్న చేశారు. ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన వేడుకలను తన ఆఫీసులో నిర్వహించిన ఆయన తనకు అండగా ఉండాలంటూ విజయవాడ ఎంపీని రిక్వెస్ట్ చేశారు. తనకు ఏ పదవి లేకపోవడంతో తన మాట చెల్లుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బుద్ధా వెంకన్న
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బుద్ధా వెంకన్న ఏది మాట్లాడిన కాస్త ఘాటుగానే, సెన్సేషన్ సృష్టించే విధంగా మాట్లాడుతుంటారు. తాజాగా అటువంటి వ్యాఖ్యలనే వెంకన్న చేశారు. ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన వేడుకలను తన ఆఫీసులో నిర్వహించిన ఆయన తనకు అండగా ఉండాలంటూ విజయవాడ ఎంపీని రిక్వెస్ట్ చేశారు. తనకు ఏ పదవి లేకపోవడంతో తన మాట చెల్లుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి వైసిపి ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొన్న వారిలో తాను ముందు వరుసలో ఉంటానని చెప్పుకొచ్చిన బుద్ధా వెంకన్న.. అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు న్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదవి లేకపోవడంతో తన మాట చెల్లుబాటు కావడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వెంకన్న.. నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో సిఐల బదిలీలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో కుంపటిని రాజేశాయి. రాష్ట్రంలో సీఐల ట్రాన్స్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గిందని వెంకన్న ఆరోపించారు. ఎమ్మెల్యేలు ఎవరిని కావాలని అడిగితే వారిని సిఐలుగా నియమించారని వెల్లడించారు. ఈ విషయంలో తన మాట చెల్లుబాటు కాలేదని ఆవేదన వ్యక్తం చేసిన బుద్ధ వెంకన్న.. ఇప్పుడు తన మాట ఎక్కడా చెల్లుబాటు కావడం లేదంటూ వాపోయారు. తానే ఇతరులపై ఆధారపడి పనులు చేయించుకోవాల్సిన దుస్థితిలోకి రావాల్సి వచ్చిందన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఏమి చేయలేకపోతున్నానని, క్షమించాలని వేడుకున్నారు.
2024 ఎన్నికల సందర్భంగా రక్తంతో చంద్రబాబు నాయుడు చిత్రపటం కాళ్ళు కడిగిన విషయాన్ని గుర్తు చేసిన బుద్ధ వెంకన్న.. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా బాధపడలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇంటి మీదకి జోగి రమేష్, ఇతర నాయకులు వెళితే అండగా నిలబడ్డానని, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు అప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరో వచ్చారో గుర్తించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఐదేళ్ల వైసిపి పాలనలో అనేక పోరాటాలు చేసిన తనను గుర్తించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. గతంలో వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, విజయసాయిరెడ్డి వంటి వారి వ్యాఖ్యలను ధీటుగా ఖండిస్తూ వచ్చానని చెప్పుకొచ్చారు. గతంలో వైసిపిపై ఎవరూ మాట్లాడలేదని, వారంతా ఇప్పుడు అధికారాన్ని వెలగబెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 2029 ఎన్నికల్లో పోరాటం చేసి అయినా టిడిపి ఎమ్మెల్యే టికెట్ సాధిస్తానని బుద్ధ వెంకన్న స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని ధీమాను వ్యక్తం చేశారు. తాను చనిపోయే వరకు టిడిపిలోనే ఉంటానని వెల్లడించారు. కేశినేని చిన్ని మూడుసార్లు ఎంపీగా గెలవడం ఖాయం అన్నారు. కేశినేని నాని మాదిరిగా కేశినేని చిన్ని మాటల మనిషి కాదని, చేతల మనిషి అంటూ కితాబు ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక బాధ్యతలను కేశినేని చిన్నిపై చంద్రబాబునాయుడు పెట్టారంటే ఆయన సమర్థత ఏమిటో అర్థమవుతుందని వివరించారు. తన ఆవేదనను చిన్ని టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేశారు.