||మీట్ ది ప్రెస్‌లో కేటీఆర్ Photo: Youtube Screen Shot||
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు తమ మాటలను హద్దుల్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం. మాట్లాడే మాటల్లో కొంచెం తేడా వచ్చినా ఓటర్లు పాతాళానికి తొక్కేస్తారు. అలా జరిగిన సంఘటనలు కోకొల్లలు. మాటల్లో వక్రభాష్యం ఉంటే చాలు మీడియా ఆడేసుకుంటుంది. సోషల్ మీడియా కోడై కూస్తుంది. తాజాగా ఆ వక్రభాష్యంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అలియాస్ కేటీఆర్ ఇరుక్కున్నారు. హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం పలు వార్తాపత్రికల ఎడిటర్లతో మీట్ ది ప్రెస్‌లో మాట్లాడిన ఆయన.. ఓ ఉదాహరణ చెప్తూ ఓ మహిళ గురించి మాట్లాడారు. ‘నేను ఓ ఊరి వెళ్తే ఓ మహిళ నా దగ్గరికి వచ్చి నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నేను ఎట్ల బతకాలే అన్నది. నాకు అర్థం కాలేదు. అంటే..అమ్మా! నువ్వు ఆ ముగ్గురు ఆడపిల్లల్ని దేశం కోసం కన్నారా? నా కోసం కన్నారా? ఎవరి కోసం కన్నారా? అని అన్నా’ అని కేటీఆర్ వివరించారు.
దీనిపై ఆ వ్యాఖ్యలు కెమెరాల్లో రికార్డు కాలేదా? అని ఓ ఎడిటర్ అడగ్గా, అది మీడియా వినుంటే తాను చచ్చేవాడిని అని కేటీఆర్ బదులిచ్చారు. ఇప్పుడు విన్నారు కదా.. ఇప్పుడు చస్తా అని వ్యాఖ్యానించారు. ఈ ఎపిసోడ్ చూసినవాళ్లు కేటీఆర్‌పై మండిపడుతున్నారు. ఓ మహిళతో మాట్లాడే మాటలేనా? అని దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలాంటివి భరించాలి గానీ, ఇష్టమొచ్చినట్లు నా కోసం పిల్లలు కన్నావా? అని అనొచ్చా? అని ప్రశ్నిస్తున్నారు. కాగా, కొన్ని రోజుల క్రితం సిరిసిల్ల నాయకులతో మాట్లాడినట్లుగా వైరల్ అయిన వాయిస్ సందేశం కేటీఆర్‌కు తలనొప్పిగా మారింది. దాన్ని సరిదిద్దుకునేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదని సమాచారం. అలాంటిది ఎన్నికలు మరో నాలుగైదు రోజుల్లో ఉన్నాయనగా.. కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయ సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా మారాయి.