బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పలు చానళ్లు, వార్తాపత్రికల్లో వార్తలు వచ్చాయి. దాంతో ఆయన పార్టీ మార్పుపై స్పందించారు.
బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణలో రాజకీయాలు అంతా వలసల చుట్టే తిరుగుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. శనివారమే ఇద్దరు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరారు. ఈ రోజు ఉదయం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా చేరగా, సాయంత్రానికే పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా రేవంత్ సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఆయనను స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం వద్దకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పలు చానళ్లు, వార్తాపత్రికల్లో వార్తలు వచ్చాయి. దాంతో ఆయన పార్టీ మార్పుపై స్పందించారు.
తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు తప్పు అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఉన్న వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. పార్టీ మార్పు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండింస్తున్నానన్నారు.తాను బీజేపీలో చేరుతున్నట్లు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ విలీనం అవుతున్నట్లు కొన్ని పత్రికలు, చానెళ్లలో వెలువడుతున్న వార్తలు, కథనాలలో ఏ మాత్రం నిజం లేదని, అవి అభూత కల్పనలు అని తేల్చిచెప్పారు. టీవీ చానళ్లు కొన్ని బీఆర్ఎస్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు, బలహీనపర్చేందుకు నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన కథనాలను ప్రచారం చేయడం విచారకరమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.
కాగా, ఇప్పటి వరకు మొత్తం 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గూడెం మహిపాల్ రెడ్డితో కలిపి 10 మంది ఎమ్మెల్యేలు అవుతారు. అటు.. ఎమ్మెల్సీలు కూడా భారీగా పార్టీ మారిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేరికలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.