బీసీలకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ తీవ్ర అన్యాయం చేశాయని కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీసీ ఉద్యమ సభలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. జనగణనలో భాగంగా కులగణన చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఈవార్తలు : బీసీలకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ తీవ్ర అన్యాయం చేశాయని కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీసీ ఉద్యమ సభలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ‘జనగణనలో భాగంగా కులగణన చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కర్నాటక, బిహార్ వంటి విఫలయత్నాల అనుభవాలు ఉన్నా కూడా తొలుత డేడికేటెడ్ కమిషన్ వేయాల్సింది. తెలంగాణ జాగృతి ఉద్యమం చేయడం, హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు రేవంత్ ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేయలేదు. బీసీల లెక్కలు ఒక కమిషన్ తీస్తుంటే... మరో కమిషన్ నివేదిక ఇస్తుంది. ఇలా చేస్తే కోర్టుల్లో నిలబడుతుందా? బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నావంటూ కాంగ్రెస్ నాయకులు నన్ను ప్రశ్నిస్తున్నారు. సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా... ఎన్నికలు పూర్తయ్యాక ఎందుకు మాట్లాడలేదని మళ్లీ కాంగ్రెస్ నాయకులే అంటారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే’ అని తెలిపారు.
‘42 శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సిందే. లేదంటే బీసీల జనాభా ఎంత ఉంటే అంత వాటా ఇచ్చి ఎన్నికల్లోకి వెళ్లాలి. దొంగ లెక్కలు, కాకిలెక్కలు కాకుండా వాస్తవ లెక్కలు తీయాలి. మన ఉద్యమాల వల్లే సావిత్రీబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మన ఉద్యమాలతో జంగుపట్టిన ప్రభుత్వ రథచక్రాలు కదులుతున్నాయి. బీసీలకు మంచి రోజులు వస్తాయి. కులం ఆధారంగా రాజ్యంగ నిర్మాతలు కొన్ని రక్షణలు కల్పించారు. అంబేద్కర్ కృషి చేకుంటే ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఫలాలు దక్కకపోతుండేది. అదే సమయంలో బీసీ కులాలను రాజ్యాంగంలో రక్షణ కల్పించాల్సింది. ఆనాడే బీసీలకు రాజ్యంగపరమైన రక్షణ కల్పించి ఉంటే అభివృద్ధిలో భారతదేశం అమెరికాను దాటేసేది. మొదటి ప్రధాని నెహ్రూ కాకా కాలేల్కర్ కమిషన్ నివేదికను తిరస్కరించారు’ అని కవిత గుర్తుచేశారు.
‘ఇది బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం కాదా? మండల్ కమిషన్ మొరార్జీ దేశాయ్ నియమించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదు. మండల్ కమిషన్ నివేదికను కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది కానీ అమలు చేయలేదు. 1980లో మండల్ కమిషన్ నివేదిక ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు? మళ్లీ కాంగ్రెసేతర ప్రధాని వీపీ సింగ్ వచ్చినప్పుడే కమిషన్ నివేదికను అమలు చేసింది. బీసీల కోసం పని చేస్తున్న వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ కూలగొట్టింది. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని రాజీవ్ గాంధీ అన్నారు. 2011 కులగణన చేసిన నివేదికను అప్పటి యూపీఏ ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా నివేదిక బయటపెట్టలేదు. కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది. రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయి. నేను చెప్పినవి తప్పయితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీసీలకు న్యాయం చేశాయి. కేసీఆర్, ఎన్టీఆర్ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులు మాత్రమే బీసీలకు న్యాయం చేశారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా బీసీలకు జరిగిన లాభం ఏమిటో ఆలోచించాలి. సావిత్రీబాయి పూలే ఆడబిడ్డ కాదు.. పులిబిడ్డ. మహిళా విద్యాకు ఎంతగానో కృషి చేశారు. ఎంతో మంది మహిళలకు చదువును నేర్పించారు సావిత్రీబాయి . ఎన్ని అవాంతరాలు ఎదురైనా సమాజ వికాసం కోసం పని చేశారు’ అని పేర్కొన్నారు.