కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఈవార్తలు: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన నగరంలోని ఓ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారని, మంగళవారం సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తవుతాయని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాతే ఆమె ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపాయి.
తీహార్ జైలులో కూడా..
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయి ఆరునెలలపాటు కవిత తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమె జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో కూడా కవిత పలుసార్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించి, వైద్య పరీక్షలు చేయించారు. ఆమె గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్టు అప్పుడు వైద్యులు వెల్లడించారు. అనంతరం కవితకు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. జైలునుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం మళ్లీ అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 6 నెలలపాటు జైలులో ఉండడం వల్లే అనారోగ్య సమస్యలు తలెత్తినట్టు భావిస్తున్నారు.