బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ వ్యవహారశైలి నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఓ సారి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన.. ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
ఇన్‌సెట్‌లో అరెకపూడి గాంధీ
హైదరాబాద్, ఈవార్తలు : బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ వ్యవహారశైలి నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఓ సారి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన.. ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అయితే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో ప్లేటు ఫిరాయించిన ఆయన.. అంతా తూచ్.. తాను కాంగ్రెస్‌లో చేరలేదని, బీఆర్ఎస్‌లోనే ఉన్నానని వ్యాఖ్యానించారు. అయితే, ఆ తర్వాత కూడా హస్తం పార్టీ నీడలోనే కొనసాగారు. అదే సమయంలో.. ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని అరెకపూడి గాంధీకి కట్టబెట్టడంతో బీఆర్ఎస్ భగ్గుమన్నది. రేవంత్ సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని తీవ్రంగా మండిపడింది. గోడ మీద పిల్లిలా గాంధీ శైలి ఉందని.. వేటు పడుతుందన్న భయంతో దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే, ఇవేమీ తనకు పట్టనట్లు, తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నట్లు వ్యవహరిస్తున్న గాంధీ.. తాజాగా, రాహుల్ గాంధీ సమావేశంలో కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. దీన్ని పసిగట్టిన బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా గాంధీని నిలదీసింది. ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్.. ‘కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ప్రకటించిన అరికెపూడి గాంధీ గారు.. మరి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఎందుకు కూర్చున్నారో?’ అని ప్రశ్నించారు. సమావేశంలో గాంధీ ఉన్న ఫొటోను జత చేసింది. క్రిశాంక్ అలా పోస్ట్ చేశారో.. లేదో.. క్షణాల్లో ఆ పోస్టుకు కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘సిగ్గులేని బతుకులు అంతే.. బీర్, బిర్యానీ కోసం అనుకుంటా.. సెల్ఫీ కోసం..’ అంటూ నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం క్రిశాంక్ చేసిన ఫొటో, పోస్ట్ వైరల్ అవుతోంది.