రెండు, మూడు రోజుల్లో ప్రజల ముందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశానికి సిద్ధమైంది. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటం, రాష్ట్రంలో తాజా పరిస్థితులతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

kcr

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

హైదరాబాద్, ఈవార్తలు : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్ని రోజులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా ముందుకు రాలేదు. తుంటి ఎముక విరిగి ఆస్పత్రిలో చికిత్స పొంది బయటికి వచ్చేసరికి లోక్‌సభ ఎన్నికల నగారా మోగింది. అప్పటికే దాదాసు 96 సభల్లో ప్రసంగించి అలసిన ఆయన.. మళ్లీ ప్రజల మధ్యకు వెళ్లారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కేంద్రంలో మోదీ హవా.. తెలంగాణలో పనిచేసింది. అధికారం కాంగ్రెస్ చేతుల్లో ఉండటంతో.. రెండు జాతీయ పార్టీలు చెరి సగం లోక్‌సభ సీట్లను గెలుచుకొన్నాయి. దీంతో పార్టీ నిర్మాణాన్ని క్షేత్రస్థాయి నుంచి ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించగా.. ఇంతలో పార్టీ సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి, వెలమ సామాజిక వర్గానికే చెందిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హస్తం గూటికి చేరారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనను కేసీఆర్ పిలిపించుకొని మాట్లాడారు.

ఇదిలా ఉండగా, బీఆర్ఎస్‌ఎల్పీపై కన్నేసిన సీఎం రేవంత్ రెడ్డి.. వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇప్పటి వరకు మొత్తం ఐదుగురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశానికి సిద్ధమైంది. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటం, రాష్ట్రంలో తాజా పరిస్థితులతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోపాటు పార్టీకి చెందిన ముఖ్యనేతలు ఈ భేటీలో పాల్గొనే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఇప్పటికే విస్తృత సమాలోచనలు జరిపిన కేసీఆర్.. సమావేశంలో నేతలతో చర్చించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ సమావేశంపై నేడో, రేపో అధికారికంగా సమాచారం వెలువడే చాన్స్ ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్