KCR | బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. సంచలన నిర్ణయం తీసుకున్న కేసీఆర్

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||సీఎం కేసీఆర్ Photo: twitter||

ఈవార్తలు, తెలంగాణ న్యూస్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసింది. శ్రావణ సోమవారం, నాగపంచమిని పురస్కరించుకొని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ జాబితాను ప్రకటించారు. 8 చోట్ల తప్ప మిగతా నియోజకవర్గాల్లో సిట్టింగ్ అభ్యర్థులకే చాన్స్ ఇచ్చారు. ఈ సారి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కంటోన్మెంట్ సీటు సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించగా, అక్కడ ఆశావహుడైన క్రిశాంక్‌కు మొండి చేయి చూపారు. హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డికి ఈ సారి సీటు కేటాయించారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు స్థానంలో ఆయన కొడుకు సంజయ్‌కు టికెట్ ఇచ్చారు. మొత్తంగా 119 స్థానాలకు గానూ 115 మంది అభ్యర్థులను ప్రకటించగా, 4 స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. అంటే.. 119 స్థానాలకు గానూ ఇప్పటి వరకు 107 స్థానాలు సిట్టింగులకు కేటాయించినట్లు అవుతుంది.

టికెట్ దక్కని సిట్టింగులు వీరే..

అసెంబ్లీ- ప్రస్తుతం - కొత్త అభ్యర్థి

వేములవాడ - చెన్నమనేని రమేశ్ - చల్మెడ లక్ష్మీ నరసింహారావు

స్టేషన్ ఘన్‌పూర్ - తాటికొండ రాజయ్య - కడియం శ్రీహరి

ఖానాపూర్- రేఖానాయక్‌ - భుక్యా జాన్సన్ రాథోడ్ నాయక్

కామారెడ్డి - గంప గోవర్ధన్‌ - కేసీఆర్

బోథ్- రాథోడ్‌ బాపూరావ్‌ - అనిల్ జాదవ్

ఉప్పల్ - భేతి సుభాష్ రెడ్డి - బండారు లక్ష్మారెడ్డి

వైరా - రాములు నాయక్‌ - బానోతు మదన్ లాల్

ఆసిఫాబాద్ - ఆత్రం సక్కు - కోవా లక్ష్మి

పెండింగ్ స్థానాలు ఇవే..

జనగామ, గోషామహల్, నాంపల్లి, నర్సాపూర్

మహిళా అభ్యర్థులు వీరే..

ఆసిఫాబాద్ (కోవా లక్ష్మీ), మెదక్ (పద్మా దేవేందర్ రెడ్డి), మహేశ్వరం (సబితాఇంద్రారెడ్డి), సికింద్రాబాద్ కంటోన్మెంట్ (లాస్య నందిత), ఆలేరు (గొంగడి సునీత), ములుగు (నాగజ్యోతి), ఇల్లందు (బాణోత్ హరిప్రియానాయక్)

శుభముహూర్తంలో ప్రకటన

ఏ పని చేసినా కేసీఆర్ శుభ ముహూర్తం చూసుకొనే చేస్తారు. ఈసారి అభ్యర్థుల ప్రకటన విషయంలోనూ అదే ఫాలో అయ్యారు. శ్రావణ సోమవారం మధ్యాహ్నం 2.38 గంటలకు ధనుర్ లగ్న శుభాంశములో అభ్యర్థులను ప్రకటించారు. ధనస్సు యుద్ధరాశి, లగ్నానికి గురుదృష్టి భాగ్యంలో ధర్మకర్మాధిపతుల యుతి రాజయోగ కారకము ప్రతాపాధిక్యాన్ని ఇస్తుందని పండితులు వెల్లడించారు. రాజ్య స్థానంలో శశిమంగళ యోగము స్వతస్సిద్ధంగా యోగకారకం అని తెలిపారు. ఈ ముహూర్తంలో కార్యాలు తలపెడితే విజయవంతం అవుతాయని వివరించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్