||ప్రతీకాత్మక చిత్రం||
తెలంగాణ రాష్ట్రం మరో ఎన్నికకు సిద్ధం అవుతోంది. ఫిబ్రవరితో గ్రామ సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుండడంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణ చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జనవరిలోనే ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. దానికోసం ఈ నెల చివర్లో షెడ్యూల్ విడుదలయ్యే చాన్స్ కనిపిస్తోంది. జనవరి 7న నోటిఫికేషన్ విడుదల చేసి మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి దశలో జనవరి 21న, రెండో దశలో జనవరి 25న, మూడో దశలో జనవరి 30న పోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పోలింగ్ రోజున ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో పంచాయతీలు, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అర్హులు వీరే..
- సర్పంచ్/వార్డు సభ్యుల పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పోటీ చేయరాదు.
- జూన్ 1, 1995 తర్వాత మూడో సంతానం ఉండకూడదు.
- ఒక కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు పుడితే పోటీకి అర్హత ఉంటుంది.
- ఒక వ్యక్తికి ఇద్దరు పిల్లలు పుట్టాక మొదటి భార్య చనిపోతే, రెండో భార్యకు ఒకరు లేదా ఇద్దరు సంతానం కలిగితే భర్తకు పోటీ చేసే అనర్హత.
- రెండో భార్యకు మాత్రం పోటీ చేసే అర్హత ఉంటుంది.
- పోటీకి కనీస వయసు 21 ఏళ్లు.
- రేషన్ డీలర్లు, సహకార సంఘాల వారు అనర్హులు.
- స్థానిక సంస్థల్లోని ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పోటీకి అనర్హులు.
- దేవాదాయ సెక్షన్ 15 ప్రకారం ఏర్పాటు చేసిన సంస్థల్లోని వారు పోటీకి అనర్హులు.
- పోటీ చేసే అభ్యర్థి గ్రామ పంచాయతీలో ఓటరుగా నమోదై ఉండాలి.
- వార్డు మెంబర్/సర్పంచ్‌కు ప్రతిపాదకుడు అదే వార్డు/గ్రామంలో ఓటరుగా ఉండాలి.
- ప్రభుత్వం ద్వారా 25 శాతానికి మించి పెట్టుబడి కలిగిన సంస్థలు/కంపెనీల మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్లు, సెక్రెటరీలు పోటీకి అనర్హులు.
- ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి ధ్రువీకరణను నామినేషన్ల పరిశీలనలోపు ఇస్తే అర్హులు.