బీజేపీ సీనియర్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపైనే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలే తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తనను జైలుకు పంపించే ప్రయత్నం చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈవార్తలు, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపైనే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలే తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తనను జైలుకు పంపించే ప్రయత్నం చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై పీడీ యాక్ట్ పెట్టాలని బీజేపీ నేతలే చెప్పినట్లు పోలీసులు తనకు చెప్పారని వెల్లడించారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా రాజాసింగ్ అసెంబ్లీకి హాజరు కావడం లేదు. దీనిపై ఆయనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి నియామకంపై పార్టీ అధిష్ఠానం చర్చలు జరుపుతున్న వేళ రాజాసింగ్ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. గత కొంతకాలంగా బీజేపీ పార్టీ నేతలపైనే విమర్శలు ఎక్కుపెడుతున్న రాజాసింగ్.. రీసెంట్‌గా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలతో రహస్యంగా సమావేశమయ్యే వారిని కాకుండా, పార్టీ కోసం పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ కోసం, కార్యకర్తల కోసం కష్టపడ పనిచేసే వ్యక్తినే అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని, అలా అయితేనే తెలంగాణలో బీజేపీ పాగా వేస్తుందని పేర్కొన్నారు.