ముగిసిన ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ.. వివరాలు వెల్లడించిన మంత్రులు

విభజన సమస్యలను పరిష్కరించుకునేందుకు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శనివారం సాయంత్రం భేటీ అయ్యారు.

cbn revanth

చంద్రబాబు, రేవంత్

హైదరాబాద్, ఈవార్తలు : విభజన సమస్యలను పరిష్కరించుకునేందుకు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలను, పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన విషయాలపై చర్చించారు. భేటీ అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితోపాటు ఇతర నాయకులకు సీఎం రేవంత్‌ రెడ్డి డిన్నర్‌ ఏర్పాటు చేశారు. డిన్నర్‌ అనంతరం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు ఏపీ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ వివరాలను మీడియాకు వివరించారు. ఇరువురు ముఖ్యమంత్రులు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్టు భట్టి విక్రమార్క వెల్లడించారు. పదేళ్లుగా పరిష్కారం కాని అంశాలపై చర్చించినట్టు వివరించారు. పెండింగ్‌ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ కమిటీలో సీఎస్‌, ముగ్గురు సభ్యులు ఉంటారన్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. కమిటీ పరిష్కరించలేని సమస్యలపై మంత్రులతో కమిటీ వేయనున్నట్టు వివరించారు. రెండు వారాల్లో అధికారులతో కమిటీ వేస్తామని వివరించారు. మంత్రులు స్థాయిలో పరిష్కారం దొరకని అంశాలు ఉంటే ముఖ్యమంత్రులు స్థాయిలో పరిష్కరాలను కనుగొనాలని నిర్ణయించినట్టు భట్టి వివరించారు. డ్రగ్స్‌, సైబర్‌ నేరాలు కట్టడికి రెండు తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు.

 ఏపీ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ మాట్లాడుతూ తెలుగు జాతి అంతా ఈ సమావేశాన్ని హర్షిస్తుందన్నారు. విభజన సమస్యలను చర్చలు ద్వారా పరిష్కరించుకునందుకు సీఎంలు ముందుకు రావడం శుభపరిణామంగా ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్‌, గంజాయి నిర్మూలను ఏపీలోనూ చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. మీడియా సమావేశంలో తెలంగాణ మంత్రులు శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌, ఏపీ మంత్రులు బీసీ జనార్ధన్‌ రెడ్డి, కందుల దుర్గేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్