||ప్రతీకాత్మక చిత్రం||
ఈవార్తలు, జగిత్యాల: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీ నినాదం తెరపైకి వస్తోంది. రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బీసీలు కాకుండా, అతి తక్కువ శాతం ఉన్న ఇతర వర్గాలు అధికారాన్ని అనుభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని బీసీ కులాలు అసెంబ్లీ సీట్ల కోసం పోరాడుతున్నాయి. అదీకాక.. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత అగ్గి పుట్టించాయి. 1 శాతం కన్నా తక్కువ ఉన్న తాము అధికంగా అధికారాన్ని అనుభవిస్తున్నామని వెల్లడించారు. దీంతో బీసీల్లో ఆలోచనలు రేకెత్తాయి. ఈ క్రమంలోనే పద్మశాలీయులు ఎప్పటినుంచో ఐక్యత కోసం పోరాడుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో అధికంగా ఉన్నా, సీట్లు దక్కించుకోలేక, పోటీ చేయలేక ఉన్న పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నారు. ఇకనైనా అలాంటి సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టి, రాజ్యాధికారం దిశగా అడుగులు వేసేందుకు సిద్ధం అవుతున్నారు.
అందులోభాగంగానే జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ సమావేశాన్ని నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ‘రాజ్యాధికార సాధన కోసం ఛలో కోరుట్ల’ పేరుతో పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. ఆగస్టు 13వ తేదీన (ఆదివారం) కోరుట్లలో పద్మశాలి ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు పద్మశాలీ పెద్దలు తెలిపారు. కుటుంబాలతో పాటు వేలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉన్నా, పద్మశాలీయులు రాజకీయంగా ఎదగలేకపోతున్నారని, వారందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చే లక్ష్యంతో సభను నిర్వహిస్తున్నట్లు జగిత్యాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ వెల్లడించారు. కులస్థులంతా తరలివచ్చి పద్మశాలీల బలాన్ని చూపించాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక నియోజకవర్గాల్లో పద్మశాలీలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారంతా కలిసివస్తే పార్టీలు దిగివస్తాయని పేర్కొన్నారు.