బంగ్లాదేశ్ మరోసారి అగ్నిగుండంగా మారింది. రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య బంగ్లాలో హింసకు కారణమైంది. షేక్ హసీనాను గద్దె దించిన విద్యార్థి నేతల్లో హాది కీలకంగా వ్యవహరించాడు.
ప్రతీకాత్మక చిత్రం
మరోసారి చెలరేగిన హింస
భారత్ వ్యతిరేక అల్లర్లు
రాడికల్ ఇస్లామిస్ట్ హత్యతో ఉద్రిక్తం
ఢాకా: బంగ్లాదేశ్ మరోసారి అగ్నిగుండంగా మారింది. రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య బంగ్లాలో హింసకు కారణమైంది. షేక్ హసీనాను గద్దె దించిన విద్యార్థి నేతల్లో హాది కీలకంగా వ్యవహరించాడు. ఇతడిని గుర్తుతెలియని వ్యక్తులు దగ్గర నుంచి కాల్చారు. తీవ్రగాయాలైన హాది మరణించడంతో ఒక్కసారిగా రాడికల్ ఇస్లామిక్ శక్తులు వీధుల్లోకి వచ్చి హింసకు కారణమయ్యారు. అయితే, వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న ఈ తరుణంలో మరోసారి అక్కడ హింసను చెలరేగడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత, అక్కడ మతోన్మాద మూక హిందువుల్ని టార్గెట్ చేసింది. మరోసారి, అక్కడ ఇస్లామిక్ శక్తులు హిందువులపై దాడులకు తెగబడుతున్నారు. ఈ హింసతో మరోసారి రాడికల్ ఇస్లామిక్ శక్తులు ఢాకాతో పాటు పలు నగరాలు, పట్టణాలను ఆధీనంలోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఆ దేశంలో భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత పెరగడంతో పాటు, మతోన్మాదం పెరిగింది. ముఖ్యంగా, జమాతే ఇస్లామి, అన్సరుల్లా బంగ్లా వంటి సంస్థలు మతాన్ని ఆయుధంగా మార్చుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు తమ శక్తిని పెంచుకోవడానికి జమాతే ఇస్లామీతో పాటు ఇతర ఇస్లామిక్ పార్టీలు ఈ హింసను ఉపయోగించుకుంటున్నాయి. ఈ జమాతే ఇస్లామీనే 1971లో పాకిస్తాన్‌తో కలిసి, బంగ్లా ప్రజల ఊచకోత, అత్యాచారాలకు కారణమైంది. షేక్ హసీనా పదవీచ్యుతి తర్వాత, బంగ్లాలో బీఎన్పీ(బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ) అధికారంలోకి వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, తామే అధికారంలోకి వచ్చేలా జమాతే ఇస్లామీ ఈ హింసను, భారత వ్యతిరేక కథనాలను ఆయుధంగా ఉపయోగించుకుంటోంది.