||బండి సంజయ్ కుమార్||
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8-10 సీట్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం బండి సంజయ్ కుమార్ అనే చెప్పుకోవాలి. ఆయన కరీంనగర్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నా, మిగతా నియోజకవర్గాల్లో బీజేపీకి జవసత్వాలు కల్పించారు. కరీంనగర్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు దాదాపు 60 వేల మంది ఉంటారు. వారి ఓట్లు ఎలాగూ బీజేపీకి పడవు. ఆ ప్రభావం ఆయన గెలుపుపై కచ్చితంగా ప్రభావం చూపుతాయి. అయితే, ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి మంచి ఓటు బ్యాంకును తెచ్చి పెట్టాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధిష్ఠానం కచ్చితంగా తెలంగాణపై ఫోకస్ పెడుతుంది. అంటే.. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపించాల్సిన అవసరం ఉంది.
అందుకే, బండి సంజయ్‌కే తిరిగి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్‌కు మద్దతు తెలిపే క్రమంలో బీజేపీ తన ఓటు బ్యాంకును కోల్పోయిందని, ఇప్పటికైనా జాతీయ నాయకత్వం మేల్కొని బండికే పగ్గాలు అప్పగించాలన్న పలువురు విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అంటే అభిమానం ఉన్న యువత, కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అంటున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా బరిలోకి దిగాలని సూచిస్తున్నారు. చూద్దాం మరి.. బీజేపీ జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో?