||డిక్లరేషన్ ఫారం అందుకుంటున్న రామగోపాల్ రెడ్డి Photo: Twitter||
ఈవార్తలు, ఏపీ న్యూస్: ఏపీలో ఎట్టకేలకు ఎమ్మెల్సీ ఎన్నికల డ్రామా ముగిసింది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి ఎన్నికల సంఘం డిక్లరేషన్ అందించింది. ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆయనకు డిక్లరేషన్ ఫారం అందజేశారు. ఎమ్మెల్సీగా టీడీపీకి చెందిన రామగోపాల్ రెడ్డి గెలిచినట్లు అధికారులు శనివారం రాత్రే ప్రకటించినా ధ్రువీకరణ పత్రం అందజేయలేదు. దీంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. జేఎన్టీయూ అనంతపూర్ గేటు ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ కారును అడ్డుకొని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ.. ఎన్నికల అధికారులు నిబంధనలను ఉల్లఘించారని, దీనిపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ ఆందోళనల అనంతరం రామగోపాల్‌రెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా ఎట్టకేలకు డిక్లరేషన్ ఫారం అందుకున్నారు.