ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య మళ్లీ కూల్చివేతల పర్వం మొదలైందా? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ప్రజావేదికను కూల్చివేయగా, ఇప్పటి కూటమి ప్రభుత్వం.. తెల్లవారకముందే వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌ను కూల్చేసింది.
అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య మళ్లీ కూల్చివేతల పర్వం మొదలైందా? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ప్రజావేదికను కూల్చివేయగా, ఇప్పటి కూటమి ప్రభుత్వం.. తెల్లవారకముందే వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌ను కూల్చేసింది. అసలేం జరిగిందంటే.. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని సీఆర్డీఏ ఆదేశాలతో మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. దీనికోసం శుక్రవారం రాత్రే ఆదేశాలిచ్చి, శనివారం తెల్లవారకముందే కార్యాలయాన్ని కూల్చేసినట్లు తెలిసింది. బుల్డోజర్లతో నిర్మాణంలో ఉన్న భవనాన్ని అధికారులు నేలమట్టం చేశారు. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. పార్టీ ఆఫీస్ నిర్మాణంపై హైకోర్టును ఆశ్రయించినా, స్థానిక ప్రభుత్వం అక్రమంగా కూల్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఆర్డీఏ నిర్ణయంపై హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు వైసీపీ నేతలు వెల్లడించారు. కూల్చివేతను నిలిపివేయాలని కోర్టు ఆదేశించినా, సీఆర్డీఏ అధికారులు ఆగమేఘాలపై దాన్ని కూల్చివేశారని ధ్వజమెత్తారు. కాగా, కేవలం రెండు గంటల్లోనే బుల్డోజర్లతో పార్టీ ఆఫీస్‌ను నేలమట్టం చేసినట్లు తెలుస్తోంది. పోలీసులను మోహరించి, గేట్లు మూసేసి మరీ కూల్చినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు నివాసం నుంచి టీడీపీ ఆఫీస్‌కు వెళ్లేదారిలో వైసీపీ ఆఫీస్‌ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాన్ని కూల్చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, కోర్టు ఆదేశాలను సీఆర్డీఏ ధిక్కరించిందని, దీనిపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నామని వైసీపీ నేతలు అంటున్నారు.
తాడేపల్లి సమీపంలోని సీతానగరం పరిధిలో బోట్ యార్డ్ లో రూ.50 కోట్లు విలువ చేసే రెండు ఎకరాల స్థలంలో ఆఫీస్ నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ స్థలంలో సర్వే నెం.202/Aలో ఎకరం రూ.వెయ్యి చొప్పున 33 ఏళ్లకు లీజ్‍కు ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఇక్కడ నిర్మాణాలకు అనుమతులు లేవని ప్రస్తుత ప్రభుత్వం అంటోంది. నిర్మాణాలకు ప్లానింగ్, కార్పొరేషన్ నుంచి పూర్తిస్థాయి అనుమతులు లభించలేదని చెప్తోంది.