ఆర్5 జోన్ లబ్ధిదారుల అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధానిలో ఆర్5 జోన్‌లో ఇళ్ళ స్థలాలు పొందిన లబ్ధిదారులకు వారి సొంత ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు.
ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి, ఈవార్తలు : ఆర్5 జోన్ లబ్ధిదారుల అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధానిలో ఆర్5 జోన్‌లో ఇళ్ళ స్థలాలు పొందిన లబ్ధిదారులకు వారి సొంత ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. అవసరమైతే టిడ్కో ఇళ్లు నిర్మించి ఇద్దామని వ్యాఖ్యానించారు. తాజా నిర్ణయంతో ఆర్5 జోన్ వివాదానికి పరిష్కారం లభించినట్లు అయ్యింది. గత ప్రభుత్వం విజయవాడ, గుంటూరు వాసులకు ఆర్5 జోన్‌లో ఇళ్ల స్థలాలను కేటాయించింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు కోర్టును ఆశ్రయించారు. తాజాగా, చంద్రబాబు ఆర్5 జోన్ సమస్యకు పరిష్కార మార్గం వెతికినట్లు అయ్యింది.
అసలేమిటీ ఆర్5 జోన్..
అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గత ప్రభుత్వం 2022 అక్టోబర్‌లో సీఆర్డీయే చట్టం-2014కు మార్పులు చేసింది. ఆర్5 పేరుతో హౌసింగ్ జోన్ ఏర్పాటు చేసింది. సీఆర్డీయే చట్టంలోని సెక్షన్-53(డీ) ప్రకారం ల్యాండ్ ఫూలింగ్ కింద సమీకరించిన విస్తీర్ణంలో 5 శాతం గృహ నిర్మాణాలకు కేటాయించవచ్చు అన్న అంశాన్ని ఆధారంగా చేసుకొని గత ప్రబుత్వం ఈ మార్పులు చేసింది. సెక్షన్ 41లో మార్పులు చేసి కొత్త జోన్‌ను తెచ్చింది. దాన్నే ఆర్ 5 జోన్‌గా పిలిచింది. 900.97 ఎకరాల భూమిని ఇళ్ల నిర్మాణం కోసం కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఆ చట్టాలకు అనుగుణంగా 2023 మార్చి 31వ తేదీన జీవో 45 విడుదల చేసింది. దానిపై రాజధాని రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తమకు కేటాయించాల్సిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పకుండా ప్రభుత్వం ఆర్5 జోన్‌ను ప్రకటించడాన్ని వ్యతిరేకించారు.