||ఏపీ మంత్రి రోజా సెల్వమణి (PIC Credit : https://www.facebook.com/RojaSelvamani.Ysrcp/photos) ||
ఈవార్తలు, పాలిటిక్స్ : ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎంట్రీపై ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీలో చేరడమా? అని ఏపీ నేతలపై ఫైర్ అయ్యారు. పనిలో పనిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా మండిపడ్డారు. రాష్ట్రాన్ని కేసీఆర్ ముక్కలు చేశారని విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్‌తో రాష్ట్రాన్ని సాధించుకున్నారని తెలిపారు. కొత్త రాష్ట్రాన్ని కోరుకున్నవారే కొత్త రాజధానిని కట్టుకోవాల్సి ఉండగా, హైదరాబాద్‌ను ఆంధ్రప్రదేశ్‌కు దూరం చేశారని అన్నారు. దాంతో ఏపీకి కొత్త రాజధాని కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఏపీని విడగొట్టిన కేసీఆర్ పార్టీలో ఏపీ నేతలు చేరడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. వారికి ఏపీ ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారని, దానిపై స్పందించాలని కోరగా.. ‘ముందుగా వాళ్ల రాష్ట్రాన్ని చూసుకొమ్మనండి.. తర్వాత మన రాష్ట్రాన్ని చూడొచ్చు’ అని చురక అంటించారు. అంతకుముందు మంత్రి రోజా తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకొన్నారు.
ముందు తెలంగాణను చూసుకోవాలని కేసీఆర్‌ను అన్న మంత్రి రోజా వ్యాఖ్యల్లో అర్థం చాలా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై బీజేపీ గాలం వేసిందన్న కోణంలో ఆమె పైవ్యాఖ్యలు చేశారని చెప్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ వ్యవహారశైలిపై వ్యతిరేకతతో ఉన్నారని గుర్తు చేస్తున్నారు.