ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి దూరంగా ఉండాలని నిర్ణయించింది. గడచిన కొద్ది రోజులుగా ఈ స్థానానికి కూటమి పోటీ చేస్తుందంటూ హడావిడి జరిగింది. 800 కు పైగా ఓటర్లు ఉండగా, 580 మంది వరకు వైసీపీకి చెందిన ఎంపీటీసీలు, జడ్పిటిసిలు ఉన్నారు. సాధారణంగా అయితే సులువుగానే ఈ స్థానాన్ని వైసిపి దక్కించుకుంటుంది. అయితే, క్యాంప్ రాజకీయాలకు తావు తీయడం ద్వారా ఈ స్థానాన్ని దక్కించుకోవచ్చు అని తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి జిల్లాకు చెందిన పలువురు నాయకులు తెలియజేశారు.
టీడీపీ కూటమి
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి దూరంగా ఉండాలని నిర్ణయించింది. గడచిన కొద్ది రోజులుగా ఈ స్థానానికి కూటమి పోటీ చేస్తుందంటూ హడావిడి జరిగింది. 800 కు పైగా ఓటర్లు ఉండగా, 580 మంది వరకు వైసీపీకి చెందిన ఎంపీటీసీలు, జడ్పిటిసిలు ఉన్నారు. సాధారణంగా అయితే సులువుగానే ఈ స్థానాన్ని వైసిపి దక్కించుకుంటుంది. అయితే, క్యాంప్ రాజకీయాలకు తావు తీయడం ద్వారా ఈ స్థానాన్ని దక్కించుకోవచ్చు అని తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి జిల్లాకు చెందిన పలువురు నాయకులు తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయడం ద్వారా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చని చెప్పారు. అయితే విశాఖ జిల్లాకు చెందిన పలువురు కూటమి ప్రజాప్రతినిధులు పోటీపై ఆసక్తిని చూపించలేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విశాఖ జిల్లాలో కూటమి అభ్యర్థులకు వేలాది మెజారిటీని ఇక్కడ ప్రజలు అందించారు. ప్రజలు గత ప్రభుత్వం చేసిన తప్పులను గుర్తించే వారికి గుణపాఠం చెప్పారని, మెజారిటీ లేకుండా మనం పోటీ చేసి అదే తప్పులను చేస్తే ప్రజలు గుర్తిస్తారని భావన పలువురు ముఖ్య నేతలు వ్యక్తం చేశారు. ఈ ఎంఎల్సి స్థానాన్ని కైవసం చేసుకోవడం వలన కలిగే ప్రయోజనం ఏమీ ఉండదని, ప్రజల్లో చులకన అయ్యేందుకు అవకాశం ఉంటుందన్న భావనను పార్టీ పెద్దలు దృష్టికి కొందరు తీసుకువెళ్లారు. వైసీపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్న నేపథ్యంలో పోటీ పెట్టి ఓటమి పాలైతే.. అది పార్టీకి పెద్ద దెబ్బగా పరిణమిస్తుందన్న భావనను మరికొందరు వ్యక్తం చేశారు.
ఇవన్నీ వైసీపీని రాజకీయంగా కోరుకునేలా చేయడానికి దోహదం చేస్తాయన్న భావనతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో వైసిపి గట్టిగానే పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి ఈ స్థానానికి అభ్యర్థిగా వచ్చాను ఖరారు చేయడం ద్వారా కూటమిని డిఫెన్స్ లోకి నెట్టినట్టు అయింది. బొత్స వంటి సీనియర్ నేతను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అంతా కలిసికట్టుగా ఆయన విజయం కోసం పని చేస్తామనే స్థితికి వచ్చారు. అందుకు అనుగుణంగానే తీవ్రస్థాయిలో మాజీ ఎమ్మెల్యేలు కృషి చేశారు. వైసీపీ అధిష్టానం బొత్సను కాకుండా మరో అభ్యర్థిని బరిలోకి దించి ఉంటే రాజకీయం మరోలా ఉండేదని చెబుతున్నారు. మరో నేతను అభ్యర్థిగా బరిలోకి దించి ఉంటే అంతర్గత కుమ్ములాటలతో ఈ స్థానాన్ని కోల్పోయి ఉండేవారన్న విశ్లేషణలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయంగా, ఆర్థికంగా బలమైన బొత్స సత్యనారాయణ ఢీకొట్టడం అంత సులువు కాదన్న భావనను టిడిపి నాయకులు వ్యక్తం చేశారు. బొత్స అభ్యర్థిగా ఖరారైన వెంటనే నియోజకవర్గాల వారీగా అభ్యర్థులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులకు అవసరమైన హామీని అందించారు. అన్ని విధాలుగా బొత్స కూటమి నాయకుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ డిఫెన్స్ లోకి నెట్టారు. ఏది ఏమైనా బొత్సను బరిలోకి దించడం ద్వారానే కూటమి పోటీకి వెనక్కి వెళ్లేలా చేసినట్టు అయిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. తాజా పరిస్థితుల్లో ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ శాసనమండలికి వెళ్లడం ద్వారా ఆ పార్టీ నాయకులకు మనో ధైర్యం పెంపొందేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.