కొత్తగా కొలువు దీరిన 18వ లోక్ సభతోపాటు రాజ్యసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గురువారం ప్రసంగించారు. తొలుత రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ కు చేరుకున్న రాష్ట్రపతికి ప్రధాని నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు స్వాగతం పలికారు.
ఉభయ సభలను ఉద్దేశించి ఉద్దేశించి మాట్లాడుతున్న రాష్ట్రపతి
కొత్తగా కొలువు దీరిన 18వ లోక్ సభతోపాటు రాజ్యసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గురువారం ప్రసంగించారు. తొలుత రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ కు చేరుకున్న రాష్ట్రపతికి ప్రధాని నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు స్వాగతం పలికారు. అనంతరం ఆమె సభలో మూడోసారి అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు. ఈ సందర్భంగా 18వ లోక్సభకు ఎన్నికైన సభ్యులను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం పదేళ్లలో సుస్థిర అభివృద్ధి సాధించిందన్నారు. త్వరలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుందని ఆకాంక్షించారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించిన ఎన్నికల సంఘాన్ని ఆమె అభినందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు సజావుగా జరిగాయన్నారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన ఈసీకి అభినందనలు తెలియజేశారు. ఎన్నికల్లో ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారన్నారు. నిజాయితీని నమ్మి ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పించినట్లు ఆమె వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్రపతి విమర్శించారు. ఈసారి కాశ్మీర్ లోయలో మార్పు కనిపించిందన్నారు. అక్కడ ప్రజలు శత్రువుల కుట్రలకు గట్టిగా బదులిచ్చారని వెల్లడించారు. ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారని పేర్కొన్నారు. రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ ఆధారంగా ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. భారతదేశం ఆరోగ్య రంగంలో అగ్రగామిగా ఉందన్నారు.
మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. పెద్ద ఎత్తున మౌలిక సౌకర్యాలు కల్పనకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు వివరించారు. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సైనికులకు ఒకే ర్యాంకు, ఒకే పింఛన్ అమలు చేశామన్నారు. రక్షణ ఉత్పత్తులు భారీగా పెరిగాయని, సీసీఏ కింద శరణార్థులకు ప్రభుత్వం పౌరసత్వం కల్పించిందని వివరించారు. జూలై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి రానున్నట్లు రాష్ట్రపతి వెల్లడించారు. ఇటీవల నీట్, నెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో జరిగిన అక్రమాలపైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రభుత్వం చేపట్టే నియామకాలు, నిర్వహించే ప్రవేశ పరీక్షలు పారదర్శకంగా జరగాలన్నారు. పేపర్ లీక్స్, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నత స్థాయిలో విచారణ జరుగుతోందని వెల్లడించారు. ఈ తరహా ఘటనల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోందని, చిన్న, సన్నకారు రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పటి వరకు 3.20 లక్షలు కోట్లు అందించినట్లు ఆమె వెల్లడించారు. రైతుల ఖాతాల్లోనే నేరుగా నగదు జమ చేస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా భారత్ ఉత్పత్తులను అందిస్తోందని రాష్ట్రపతి వివరించారు.