రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాం. రుద్రాక్షలు చాలా పవిత్రమైనవి, అంతే శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి.
ప్రతీకాత్మక చిత్రం
రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాం. రుద్రాక్షలు చాలా పవిత్రమైనవి, అంతే శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి. ఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖ సంతోషాలతో గడపడానికి పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే ఈ రుద్రాక్ష. తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు, ఆనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు రుద్రాక్షలు ధరిస్తే వారి సమస్యలు మటుమాయం అయిపోతాయి. అంతేకాదు ఏవైనా వ్యసనాలకు లోనైనవారు తమ అలవాటు మంచిది కాదు అని తెలిసి అందులో నుండి బయట పడలేకపోతున్నట్లు అయితే రుద్రాక్ష మాలను ధరిస్తే మంచి ఫలితాలను పొందుతారు. ఎవరి మెడలో అయితే రుద్రాక్ష ఉంటుందో వారు ఈశ్వర అనుగ్రహానికి పాత్రులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి.
రుద్రాక్ష అనేది ఆ పరమశివునికి ఇష్టమైన ఆభరణం. ఇది రత్నం కంటే తక్కువ కాదు. శివుని కంటి నుంచి కారిన బిందువులే రుద్రాక్షలుగా మారాయి అని అంటారు. సతీదేవి శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కన్నీళ్లు భుమిపై చాలా ప్రదేశాల్లో పడ్డాయి. ఆ కన్నీళ్లు భూమిపై ఎక్కడైతే పడ్డాయో ప్రకృతి రుద్రాక్ష రూపంలో ఓ అద్భుత అంశాన్ని పొందింది. రుద్రాక్షలు 21 రకాలు. ఒక్కో నక్షత్రాన్ని బట్టి ఒక్కో రకం రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది. ఒక్కో రుద్రాక్ష ఒక్కో విధమైన ప్రయోజనాన్ని అందిస్తుంది. రుద్రాక్షను ధరించేటప్పుడు మన రాశి చక్రం ప్రకారం, మన జన్మ నక్షత్రం ప్రకారం ఏ రుద్రాక్షను ధరించాలో దాన్ని మాత్రమే ధరించవలసి ఉంటుంది. రుద్రాను శుద్ధి చేయడానికి కుడా కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని తప్పకుండా పాటించాలి. శ్రావణ మాసంలోని శివరాత్రి రోజున రుద్రాక్షను ధరించడం అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున శివునికి ప్రత్యేక పూజలతో పాటుగా, రుద్రాక్షను ధరించడం చాలా మంచిది. అదే మాసంలో అనగా శ్రావణ సోమవారం రోజున రుద్రాక్షను ధరించడం విశేషం. శ్రావణ మాసంలోని సోమవారాలు శివుని రోజులుగా పరిగణించబడుతాయి. కావున ఈ రోజుల్లో రుద్రాక్షను ధరిస్తే శివుని ఆశీస్సులు ఉంటాయి.
రుద్రాక్షను ధరించడానికి ఉత్తమ సమయం ఉదయం. రుద్రాక్షను ధరించే ముందు పంచామృతం, గంగాజలంతో శుద్ధి చేసుకొని ఒక గుడ్డతో తుడిచి, తిలకంతో అలంకరించుకోవాలి. తర్వాత సూర్యరశ్మి తలిగేలా పెట్టుకోవాలి. ఆ తర్వాత 108 సార్లు ఓం నమః శివాయ అని జపించాలి. అనంతరం రుద్రాక్షను ధరించాలి. రుద్రాక్షను ఎరుపు, పసుపు, తెలుపు దారంతో మాత్రమే ధరించాలి. వెండి, బంగారం, రాగితో చేసినవి కుడా ధరించవచ్చు. సబ్బు, శాంపు వంటి వాటితో రుద్రాక్షలను కడగరాదు. ఇలా చేస్తే రుద్రాక్షలోని శక్తులు తొలగిపోతాయి. రుద్రాక్షను ధరించిన తర్వాత ఒక వారం రోజుల వరకు దాన్ని తీసివేయరాదు. కొన్ని సందర్భాలలో రుద్రాక్షలను తీసివేయాల్సి వస్తే మరలా వాటిని శుద్ధి చేసిన తర్వాతే ధరించాలి. 27 పూసల కంటే తక్కువ రుద్రాక్ష మాలను ధరించకూడదు. ఇలా చేస్తే శని దోషం ఏర్పడవచ్చు. మాంసాహారం తినే వారు, మద్యం తగేవారు, పొగ తాగేవారు రుద్రాక్షను ధరించడం కీడు. శ్మశానానికి వెళ్లేవారు ఇంట్లో రుద్రాక్ష మాల తీసివేసి వెళ్లాలి అని పురాణాలు చెబుతున్నాయి. రుద్రాక్షను ఎప్పుడు కుడా బొడ్డు పైభాగం వరకు మాత్రమే ధరించాలి. రుద్రాక్షను ప్రసూతి గదిలో ఉంచకూడదు. పుట్టుక, మరణం ఉన్న ప్రదేశాల్లో రుద్రాక్షను ధరించకూడదు అనే కారణంగానే ఈ నియమాలను పాటించాలి. శృంగారంలో పాల్గొనే సమయంలో కుడా రుద్రాక్షను ధరించకూడదు. రాత్రి పడుకునే ముందు కుడా రుద్రాక్షను తీసివేసి పడుకోవాలి. తీసివేసిన రుద్రాక్షను పూజ గదిలో పెట్టి, ఉదయం స్నానం చేసిన తర్వాత ధరించాలి.
రుద్రాక్షను ధరించిన ప్రతిసారి మత్రం జపించాలి. స్త్రీలు నెలసరి సమయంలో రుద్రాక్షను ధరించకూడదు. మరొకరు ధరించిన రుద్రాక్షను ఎప్పుడూ ధరించకుడదు. రుద్రాక్షను ధరించిన తర్వాత రోజు ధ్యానం చేయాలి. ఇది రుద్రాక్ష శక్తిని పెంచుతుంది. రుద్రాక్షను చేతికి లేదా మెడలో ధరించవచ్చు. చేతికి ధరించాలంటే 12 రుద్రాక్షలను, మెడలో ధరించాలంటే 54 రుద్రాక్షలు ఉండాలి. పురాణాలు, గ్రంథాల ప్రకారం రుద్రాక్షను ధరించిన వ్యక్తి దీర్ఘాయువుతో జీవిస్తాడని చెబుతారు. శని, రాహు, కేతువు వంటి గ్రహాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ నియమాల ప్రకారం రుద్రాక్షను ధరించడం మంచిదని పురాణాలు చెబుతున్నాయి.