పిల్లలకు మొబైల్ ఫోన్ పిచ్చి పట్టుకుంటోంది. ఏడాది, రెండేళ్ల వయసులోనే స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారు. 6-7 ఏళ్ల వయస్సు వచ్చేసరికి ఫోన్ లాక్కుంటే సైకోలుగా మారుతున్నారు. ఇంకాస్త పెద్దవాలేతే ఇళ్లు వదిలి పారిపోతున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
పిల్లలకు మొబైల్ ఫోన్ పిచ్చి పట్టుకుంటోంది. ఏడాది, రెండేళ్ల వయసులోనే స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారు. 6-7 ఏళ్ల వయస్సు వచ్చేసరికి ఫోన్ లాక్కుంటే సైకోలుగా మారుతున్నారు. ఇంకాస్త పెద్దవాలేతే ఇళ్లు వదిలి పారిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలు, హత్యలకు కూడా వెనుకాడట్లేదు. పిల్లలు ఏడుపు ఆపడానికి, ఓ ముద్ద మింగడానికి, డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి పేరెంట్స్ స్మార్ట్‌ఫోన్‌ను అలవాటు చేస్తున్నారు. పిల్లలు వాటికి బానిసలవుతున్నారు. చదువును పట్టించుకోకుండా వాటికే అలవాటు పడుతున్నారు. ఈ విషయం గమనించి ఫోన్ తీసుకుంటే పేరెంట్స్ మీద కోపగించుకుంటున్నారు లేదా తమను తాము గాయపరచుకుంటున్నారు. కొందరు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఆల్కహల్ అడిక్షన్‌లాగే మొబైల్ అడిక్షన్ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది అనడంలో ఆశ్చర్యం లేదు.
ఈ సమస్య గురించి ప్రముఖ సైకాలజిస్ట్‌లు స్పందించారు. ‘పిల్లలకు 8 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఫోన్ అసలే ఇవ్వకూడదు. 16 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఫోన్ ఇవ్వడం సరైనది, కానీ అప్పటికి కూడా పేరెంట్స్ పక్కనే ఉండాలి. 16 సంవత్సరాల తరువాత మొబైల్ ఉపయోగించి పిల్లలు ఏమి చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? అన్నది పర్యవేక్షణ చేయాలి. 8 సంవత్సరాలకే ఫోన్ అలవాటు పడితే తర్వాత మానడం చాలా కష్టం. ఆ ప్రభావం చదువుపై, ఆరోగ్యంపై పడుతుంది. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతారు. ఎక్కువగా రియాక్ట్ అవుతారు. మొండిగా మారి పేరెంట్స్‌పై ప్రతీకార భావం చూపుతారు. గంటలకొద్దీ మొబైల్ చూసిన ఫలితంగా పిల్లల మెదడు, కళ్లపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. మానసిక సమస్యలు కూడా వస్తున్నాయి. పిల్లల దగ్గర నుంచి మొబైల్ తీసుకున్నప్పుడు వారు విచిత్రంగా ప్రవర్తిస్తారు. తమతో తామే మాట్లాడుకుంటారు. మానసిక ఆందోళనతో బాధపడుతారు. ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తారు’ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొబైల్‌కు బానిసలవడం వల్ల పిల్లల శారీరక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. మొబైల్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారు. మొబైల్‌పై దృష్టి పెట్టి ఎంత తింటున్నారో, ఏం తింటున్నారో కూడా గమనించడం లేదు. ఈ కారణంగా ఎదుగుదలపై కూడా ప్రభావం పడుతోంది. సెల్‌ఫోన్‌లోనే గేమ్స్ ఆడటం వల్ల శారీరక చురుకుదనం తగ్గిపోతుంది. చిన్నతనంలోనే ఊబకాయం, బీపీ సమస్యలు వస్తున్నాయి.
పిల్లలకు మొబైల్ అలవాటు మాన్పించడం ఎలా?
ఇంట్లో పేరెంట్స్ మొబైల్ వాడకం తగ్గించాలి. పిల్లలతో ఎక్కువగా సమయం గడపాలి. సరదాగా ఆటలు ఆడాలి. బయటకు తీసుకువెళ్లాలి, గ్రౌండ్‌కి తీసుకువెళ్లి ఇతర పిల్లలతో ఆడుకునేలా ప్రోత్సహించాలి. సంగీతం నేర్పించాలి. గ్రాండ్ పేరెంట్స్‌కు దగ్గర చేయాలి. వాళ్లతో జీవిత కథలు చెప్పించాలి, పూరాణాలు, ఇతిహాసాలు కూడా చిన్నతనంలోనే తెలియజేయాలి. వీలైనంత తొందరగా నిద్రపోవడానికి అలవాటు చేయాలి. ఈ అలవాట్లు చిన్నతనంలోనే ఏర్పడితే, వారు పెద్దయ్యాక కూడా మీ మాట వినే అవకాశం ఉంటుంది.