ఒకప్పుడు చిన్నపిల్లలకు తల్లిదండ్రులు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు తాము చెప్పిన కథలతో వారిని మంత్రముగ్ధులను చేసేవారు. చిన్నతనంలోనే వారు నీతి కథలు, ఇతిహాసాలు, పురాణాలు మొదలైన అనేక రకాల కథలు విని పెరిగేవారు.
ప్రతీకాత్మక చిత్రం
ఒకప్పుడు చిన్నపిల్లలకు తల్లిదండ్రులు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు తాము చెప్పిన కథలతో వారిని మంత్రముగ్ధులను చేసేవారు. చిన్నతనంలోనే వారు నీతి కథలు, ఇతిహాసాలు, పురాణాలు మొదలైన అనేక రకాల కథలు విని పెరిగేవారు. రాత్రి వేళలో కథలు వింటూ, పిల్లలు గాఢ నిద్రలో మునిగిపోయేవారు. కానీ, కొంతకాలంగా మారిపోతున్న జీవనశైలిలో ఈ అలవాటు తగ్గిపోవడం చూస్తున్నాం. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, తల్లిదండ్రులు బిజీ అయ్యిపోవడం వల్ల పిల్లలకు కథలు చేప్పే అవకాశం తగ్గిపోయింది. అయితే, నిద్రకు ముందు పిల్లలకు కథలు చెప్పడం చాలా ప్రయోజనకరం. ఈ ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..
1. విలువలు, మంచితనం: పిల్లల్లో పెరిగే మానసిక శక్తి!
పిల్లలకు కథలు చెప్పడం వల్ల చిన్నప్పటి నుంచే వారిలో విలువలు పెరుగుతాయి. కథల్లోని మంచి విషయాలు వారు మెదడులో నిలిపి ఉంచే అవకాశం ఉంటుంది. దీంతో వారిలో దయ, మంచితనం పెరుగుతుంది. అలాగే, వారి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా మెరుగుపడుతుంది.
2. బంధం
ఇటీవలి కాలంలో పనులలో బిజీగా ఉండే తల్లిదండ్రులు పిల్లలకు సరైన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. ఫలితంగా, పిల్లలతో తల్లిదండ్రుల బంధం ఎమోషనల్‌గా అంతగా బలంగా ఉండటం లేదు. కానీ కథలు చెప్పడం వల్ల, మీరు వారితో విలువైన సమయం గడిపినట్టు అవుతుంది. దీనివల్ల వారి మధ్య ఎమోషనల్ కనెక్షన్ మరింత బలపరుస్తుంది.
3. ఊహాశక్తి
పిల్లలకు చెప్పే కథల్లో ఎక్కువగా ఇమాజినేషన్ అంశాలు ఉంటాయి. కొత్త ప్రదేశాలు, కొత్త వ్యక్తులు, వేర్వేరు పరిస్థితులతో కథలు ఉంటాయి. ఈ కథలు వినడంతో పిల్లలు ఆ ప్రదేశాలను, వ్యక్తులను, పరిస్థితులను మనసులో ఊహించుకుంటారు. దీని వల్ల వారి ఊహాశక్తి పెరుగుతుంది. అంతేకాక, వారి సృజనాత్మకత కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ అంశాలు వారి జీవితంలో ముందుకు సాగేందుకు ఎంతో సహాయపడతాయి.
4.కొత్త పదాలు, భాషపై జోష్ పెరిగింది!
కథలు విన్నప్పుడు పిల్లలకు తరుచుగా కొత్త పదాలు పరిచయమవుతాయి. కథలలో తెలియని పదాలు వస్తున్నప్పుడు, పిల్లలు పెద్దలను అడిగి వాటి అర్థం తెలుసుకుంటారు. ఈ ప్రక్రియ ద్వారా వారు కొత్త పదాలను నేర్చుకుంటారు. ఇంకా, కథలు పిల్లల్లో భాషపై అవగాహనను పెంచుతాయి. భాషను సహజంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది, ఇది వారి చదువుకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
5. స్ట్రెస్ తగ్గుతుంది
పిల్లలు కథలను పూర్తిగా ఏకాగ్రతతో వింటారు, దృష్టి వాటిపై కేంద్రీకరిస్తారు. ఇది వారికి ఒత్తిడి ఉన్నా తగ్గించడానికి సహాయపడుతుంది, రిలాక్సేషన్ కలుగుతుంది. నిద్ర పట్టేందుకు కూడా కథలు చెప్పడం ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా, పిల్లలతో సమయం గడపటం వల్ల పెద్దల ఒత్తిడి కూడా తగ్గుతుంది.