అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీ గుండెను ఆరోగ్యంగా ఉంచే కొన్ని యోగాసనాల గురించి తెలుసుకుందాం.
ప్రతీకాత్మక చిత్రం
నేటికాలంలో చెడు ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి ఎన్నో వ్యాధులకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా చిన్నాపెద్దా అనే తేడా లేకుండా చాలా మంది గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. చిన్న వయస్సులోనే గుండెజబ్బులతో మరణించినవారు కూడా ఎంతో మంది ఉన్నారు. గుండె సంబంధిత వ్యాధులకు సరైన చికిత్సతోపాటు జీవనశైలిలో కూడా మార్పులు అవసరం. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తనాళాలు తగ్గిపోయి హార్ట్ బ్లాక్ సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల రక్తనాళాల్లో ఆక్సిజన్ , పోషకాలు తగ్గుతాయి. అధిక కొలెస్ట్రాల్ లెవల్స్, అధిక రక్తపోటు, ధూమపానం, మధుమేహం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల హార్ట్ బ్లాక్ సమస్య వస్తుంది. గుండె జబ్బులు ఇతర సమస్యలను తగ్గించే ఏడు యోగాసనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హార్ట్ ఫ్రెండ్లీ యోగా భంగిమలు:
గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ ఏడు ఆసనాలను మీ దినచర్యలో తప్పకుండా చేర్చుకుంటే రక్తనాళాలు శుద్ధి అవుతాయి. గుండెపోటు, స్ట్రోక్ సమస్యను తగ్గించుకోవచ్చు.
తడసానా:
తడసనా చాలా శక్తివంతమైన యోగా భంగిమ. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో.. గుండె కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఈ యోగాసనాన్ని ఉదయాన్నే ఆచరిస్తే హార్ట్ బ్లాక్ సమస్య తొలగిపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
భుజంగాసనం:
గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు భుజంగాసనం అత్యంత ప్రభావవంతమైన యోగాసనాలలో ఒకటి. ఇది ఛాతీని పెంచి, గుండె మొత్తం పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం వేస్తే గుండె కండరాలు ఉబ్బి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
ఉత్తానాసనం:
నిలబడి ముందుకు వంగడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. రెండూ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడటంతోపాటు రక్తపోటును తగ్గిస్తుంది.
సేతు బంధాసనం:
వెన్ను కండరాలను బలోపేతం చేయడానికి..వెన్ను ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఇది గుండెను ఉత్తేజపరిచి.. హార్ట్ బ్లాక్ సమస్య ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
వృక్షాసనం:
ఇది ఏకాగ్రతను సమతుల్యం చేస్తుంది. ఈ యోగ భంగిమ రక్త ప్రసరణను మెరుగుపరడచంతోపాటు ఒత్తిడి.. ఆందోళనను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
అర్ధ మత్సేంద్రాసన:
అర్ధ మత్సేంద్రాసనం ఉదర అవయవాలు, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది.
శవాసనం:
విశ్రాంతి తీసుకోవడానికి,కోలుకోవడానికి శవంలా పడుకోవడం. ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.ఇవి చాలా సురక్షితమైనవి అయినప్పటికీ, మీ రోజువారీ వ్యాయామ దినచర్యలో వాటిని చేర్చే ముందు నిపుణులను సంప్రదించండి. శరీరానికి సరిగ్గా సరిపోయేది మీకు తెలుస్తుంది. రోజువారీ కార్యకలాపాల్లో మార్పులు చేసేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం మర్చిపోవద్దు.