ఈ రోజుల్లో చిన్నా పెద్ద తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా చెల్లింపులు చేసేందుకు, లేదా ఇతర పనులు అన్నింటికీ ఒకే క్లిక్‌తో ప్రతిదీ అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పగలు, రాత్రి తమ మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ఈ రోజుల్లో చిన్నా పెద్ద తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా చెల్లింపులు చేసేందుకు, లేదా ఇతర పనులు అన్నింటికీ ఒకే క్లిక్‌తో ప్రతిదీ అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పగలు, రాత్రి తమ మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. ఈ మల్టీ టాస్కింగ్ పరికరాన్ని ప్రజలు సౌకర్యవంతంగా భావించినప్పటికీ, ఇది భవిష్యత్తులో చాలా నష్టాన్ని కలిగిస్తుంది. అతిగా మొబైల్ ఫోన్ల వాడకం వల్ల కంటి సమస్యలు, మానసిక రుగ్మతలు రావడమే కాకుండా పురుషుల్లో సంతానలేమి సమస్య కూడా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
మొబైల్ ఫోన్ సంతాన లేమికి కారణమవుతుందా?
మొబైల్ ఫోన్ల మితిమీరిన వినియోగం, వాటిని ఉంచే విధానంపై జరిపిన అధ్యయనంలో దీనివల్ల పునరుత్పత్తి అవయవాలకు సంబంధించిన తీవ్ర సమస్యలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మొబైల్ ఫోన్‌ను ప్యాంట్ జేబులో ఉంచుకోవడం వల్ల పురుషుల జననేంద్రియాలపై నెగిటివ్ ప్రభావం చూపుతుందని తేలింది. ఇది దీర్ఘకాలిక నపుంసకత్వానికి కూడా దారితీయవచ్చు. ఇది కేవలం పురుషులకు మాత్రమే కాదు స్త్రీల పునరుత్పత్తి ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు.
పురుషుల సంతానోత్పత్తిపై ప్రభావాలు:
గత దశాబ్ద కాలంగా అంటే సెల్ ఫోన్లు విరివిగా ఉపయోగిస్తున్న ఈ దభాబ్దంలో పురుషులలో సంతానోత్పత్తి సమస్యలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా వీర్యకణాల సంఖ్య తగ్గిన కేసుల సంఖ్య పెరిగిందని వైద్య నివేదికలు వెల్లడించాయి. మొబైల్ ఫోన్‌ల వంటి తక్కువ-స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ విద్యుదయస్కాంత తరంగాలు పురుషుల సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తున్నాయని కొందరు పరిశోధకులు విశ్వసిస్తున్నారు.
మొబైల్ ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగితే, నపుంసకత్వము వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
జెనీవా విశ్వవిద్యాలయానికి చెందిన స్విస్ ట్రాపికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యంపై మొబైల్ ఫోన్ వాడకం వినియోగ విధానాల ప్రభావాన్ని పరిశీలించారు. 13 సంవత్సరాల అధ్యయనం ప్రకారం, యువకులలో తక్కువ స్పెర్మ్ సామర్థ్యం మొత్తం స్పెర్మ్ కౌంట్ (TSC) కు స్మార్ట్‌ఫోన్ వాడకం ఒక కారణమని తేలింది.
ఫెర్టిలిటీ అండ్ స్టెరిలిటీ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం, పరిశోధకులు 2005 2018 మధ్య సైనిక నియామక కేంద్రాలలో 18- 22 సంవత్సరాల మధ్య వయస్సు గల 2,886 మంది పురుషులను పరీక్షించారు. ప్రయోగశాల నిపుణులు వీర్య నమూనాలను తీసుకొని స్పెర్మ్ సామర్థ్యం, మొత్తం స్పెర్మ్ కౌంట్ వాటి చలనాన్ని అధ్యయనం చేశారు. రోజుకు 20 కంటే ఎక్కువ సార్లు ఫోన్‌లను ఉపయోగించే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందని తేల్చారు. అలాగే రోజుకు రెండుసార్లు ఫోన్‌లను ఉపయోగించే పురుషులలో స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా ఉందని అధ్యయనం నిర్ధారించింది.
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్‌లకు దూరంగా ఉండటం దాదాపు అసాధ్యం అయినప్పటికీ, దాని వినియోగాన్ని పరిమితం చేయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించడం అలవాటు చేసుకోమని చెబుతున్నారు. నిద్రపోయేటప్పుడు మొబైల్‌ని, ఛాతీకి, ప్యాంటు జేబులో దగ్గరగా ఉంచుకోవడం మానుకోవాలని చెబుతున్నారు.