ఆయుర్వేదంలో, వాత, పిత్త, కఫా వంటి శరీరంలోని అన్ని వ్యాధులను నియంత్రించడంలో పసుపునీరు మేలు చేస్తుంది. అంతేకాదు పసుపు నీరు ఊబకాయాన్ని తగ్గించడంతోపాటు ఇమ్యూనిటీనికి పెంచేందుకు ప్రభావవంతంగా పనిచేస్తుందని ఇప్పటికే రుజువు చేసింది. ఉదయాన్నే పసుపునీరు తాగితే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం.
ప్రతీకాత్మక చిత్రం
భారతీయుల వంటగదిలో పసుపు తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి వంటలోనూ పసుపును వాడుతుంటారు. అంతేకాదు ఆయుర్వేదంలో కూడా పసుపునకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందం నుంచి మొదలుకొని రోగనిరోధకశక్తిని పెంచేంత వరకు పసుపులో అనేక అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు పసుపులో క్రిమినాశక గుణాలు ఉన్నాయి కాబట్టి దీనిని ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు రుజువు చేశాయి. పసుపు నీరు తాగడం వల్ల ఊబకాయం తగ్గడం..బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది. ఖాళీ కడుపుతో పసుపు నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
పసుపు నీటిని ఎలా తయారు చేయాలి?
పసుపు నీటిని తయారు చేసేందుకు తాజా పసుపును తీసుకోవాలి. ఒక పసుపు ముక్కను తీసుకుని నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని తాగాలి. కావాలంటే 1 గ్లాసు నీటిలో 1/2 టీస్పూన్ పసుపు వేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం గోరువెచ్చగా తాగాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు నీటిని తాగడం వల్ల మీరు మరిన్ని ప్రయోజనాలను పొందుతారు.
త్వరగా బరువు తగ్గుతారు:
ఖాళీ కడుపుతో పసుపు నీళ్లు తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి పసుపు నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కావాలంటే పసుపుతో పాటు కొంచెం అల్లం రసాన్ని కూడా నీళ్లలో వేసుకోవచ్చు. వేడి చేసి టీ లాగా తాగాలి. పసుపు నీరు గుండెకు కూడా మేలు చేస్తుంది.
ఆర్థరైటిస్‌లో ఉపశమనం:
రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న రోగులకు ప్రయోజనకరంగా ఉండే పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కనిపిస్తాయి. పసుపు నీళ్లు తాగితే కీళ్ల నొప్పుల సమస్య తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. పసుపు నీరు వాపును తగ్గిస్తుంది.
జీర్ణక్రియ బలపడుతుంది:
పసుపు నీటిని తాగడం ద్వారా జీర్ణ సమస్యలు నయమవుతాయి. పసుపులో ఉండే కర్కుమిన్ సమ్మేళనాలు పిత్తాశయం నుండి పిత్తాన్ని విడుదల చేయడంలో సహాయపడతాయి. తద్వారా జీర్ణక్రియకు సహాయపడతాయి. పసుపు నీరు తాగడం వల్ల కాలేయం డిటాక్సిఫై అవుతుంది. దీంతో గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్య తగ్గుతుంది.