(Photo: ప్రతీకాత్మక చిత్రం)
ఈవార్తలు, నేషనల్ న్యూస్: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు తగిన మార్గదర్శకాలు జారీ చేసిన సర్కారు.. తాజాగా, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై దృష్టి పెట్టింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్ నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ (RTPCR Test) పరీక్షలు తప్పనిసరి చేసింది. లక్షణాలున్నవారిని క్వారంటైన్‌లో ఉంచాలని నిర్ణయించింది. కొవిడ్ పరిస్థితిపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్షుక్ మాండవీయ చర్చించిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం.
అంతేకాకుండా, అంతర్జాతీయ ప్రయాణం చేసేవారు కచ్చితంగా ఎయిర్ సువిధ (Air Suvidha) సెల్ఫ్ డిక్లరేషన్ ఫారంను నింపేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫారంలో ‘నాకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు’ అని రాసి ఉంటుంది. దాన్ని సమ్మతిస్తూ ఫారాన్ని ఎయిర్‌పోర్టులో సమర్పించాలి. అటు.. కరోనా విజృంభించే అవకాశాలున్నందున అన్ని రాష్ట్రాలు ఆక్సిజన్ నిల్వలు ఉండేలా చూసుకోవాలని కేంద్రం సూచించింది.
ప్రపంచవ్యాప్తంగా 2,07,19,932 యాక్టివ్ కేసులు
వరల్డోమీటర్ లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 66,13,37,033 కేసులు నమోదయ్యాయి. అందులో 66,84,936 మంది మరణించారు. 63,39,32,165 మంది కరోనా నుంచి కోలుకొని ఇండ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం 2,07,19,932 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో 2,06,81,405 మంది సాధారణ లక్షణాలతో, 38,527 మంది తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్నారు.