ప్రపంచ వ్యాప్తంగా షుగర్ తో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఒకసారి షుగర్ వస్తే జీవితాంతం బాధపడాల్సిందే అన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి ఉంది. భారత్లో గత కొన్నేళ్లుగా ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
షుగర్ టెస్టింగ్
ప్రపంచ వ్యాప్తంగా షుగర్ తో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఒకసారి షుగర్ వస్తే జీవితాంతం బాధపడాల్సిందే అన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి ఉంది. భారత్లో గత కొన్నేళ్లుగా ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా 30 ఏళ్లలోపు యువత డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇది అత్యంత ఆందోళనను కలిగిస్తోంది. అయితే, మందులకు పూర్తిగా లొంగని మధుమేహానికి చైనా శాస్త్రవేత్తలు కణమార్పిడి చికిత్సతో చెక్ పెట్టారు. నిత్యం ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకుంటేగాని రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉండని ఒక రోగికి.. ఈ చికిత్సతో కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇన్సులిన్ ఇంజక్షన్ల సంగతి అటు ఉంచితే.. 33 నెలలుగా అసలు మధుమేహానికి ఏ మందులు వాడకపోయినా ఆ రోగి షుగర్ అదుపులో ఉండేలా చేశారు చైనా పరిశోధకులు. చైనా ఆర్థిక రాజధాని షాంగై లోని సాంగ్ జంగ్ అనే ఆసుపత్రి వైద్యులు ఈ ఘనతను సాధించారు. 25 ఏళ్లుగా టైప్-2 డయాబెటిస్ తో బాధపడుతున్న 59 ఏళ్ల రోగికి కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో 2017లో ఆయనకు మూత్రపిండాల మార్పిడి చికిత్స చేశారు. అదే సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాటిక్ హైలెట్ కణాల పనితీరు కూడా పూర్తిగా మందగించడంతో ఆయన నిత్యం పలు ఇన్సులిన్ ఇంజక్షన్ లు చేయించుకోవాల్సి వచ్చేది. వైద్యులు 2021 జూలైలో ఆయనకు హైలెట్ కణాల మార్పిడే చికిత్స చేశారు. ఈ పేషెంట్ శరీరంలోని పెరిఫెరల్ బ్లడ్ మోనో న్యూక్లియర్ సెల్స్ ను ప్యాంక్రియాటిక్ హైలెట్ కణాల తరహాలో పని చేసే సీడ్ సెల్స్ గా మార్చారు. వీటిని హైలెట్ కణాలు స్థానంలో అమర్చారు. ఈ చికిత్స తర్వాత 11 వారాలకు ఆ రోగికి ఇన్సులిన్ ఇంజక్షన్ల అవసరం లేకుండా పోయింది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే మాత్రలను మాత్రం ఏడాది పాటు కొనసాగించి.. ఆ తరువాత వాటిని ఆపేశారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా ఉండడంతో ఈ పరిశోధన పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ విధానం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తే షుగర్ బాధితులకు ఎంతో మేలు చేసినట్లు అవుతుందని నిపుణుల పేర్కొంటున్నారు.