లడ్డూ వివాదంలో ఇరుక్కుపోయిన వైసీపీ.. టార్గెట్ చేసి కొట్టిన సీఎం చంద్రబాబు

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు అందించే స్వామి వారి ప్రసాదం లడ్డు అపవిత్రమైందంటూ సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిరోజుల కిందట సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేకెత్తించాయి. టీటీడీ ఈవో శ్యామలరావు తిరుపతి లడ్డూలో వనస్పతి కలిసిందంటూ వ్యాఖ్యానించగా.. చంద్రబాబు నాయుడు మాత్రం జంతువుల కొవ్వు కలిసిందంటూ పేర్కొన్నారు.

Laddu, YCP

లడ్డూ, వైసీపీ

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు అందించే స్వామి వారి ప్రసాదం లడ్డు అపవిత్రమైందంటూ సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిరోజుల కిందట సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేకెత్తించాయి. టీటీడీ ఈవో శ్యామలరావు తిరుపతి లడ్డూలో వనస్పతి కలిసిందంటూ వ్యాఖ్యానించగా.. చంద్రబాబు నాయుడు మాత్రం జంతువుల కొవ్వు కలిసిందంటూ పేర్కొన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే టిడిపి నాయకులు నిజంగానే తిరుపతి లడ్డూలో కొవ్వు కలిసిందంటూ రిపోర్టులను విడుదల చేశారు. ఈ వ్యవహారంలో ప్రస్తుతం వైసీపీ అన్ని వైపుల నుంచి ముప్పేట దాడిని ఎదుర్కొంటోంది. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా టిడిపి, జనసేన, బిజెపి నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ ఇప్పటికే ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. భోపాల్ లోను బిజెపి కేంద్రమంత్రి ఒకరు జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతోపాటు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గత పాలకుల తప్పుడు నిర్ణయాల కారణంగానే తిరుమల పవిత్రత దెబ్బతినిందంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అయితే ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టబోమని, తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించిన వారిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొంటూ ప్రజల్లోకి మరింతగా ఈ ఇష్యూ వెళ్లేలా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ప్రజల్లో జోరుగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు అందించే లడ్డుపై వివాదం జరుగుతోంది. ఒకరకంగా చెప్పాలంటే సామాజిక మాధ్యమాలు వేదికగా వైసీపీ లక్ష్యంగా అన్ని వైపుల నుంచి ట్రోల్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టే ఈ తరహా చర్యలకు పాల్పడ్డారని, అతి తక్కువ ధరకు నాణ్యమైన సరఫరా చేస్తామని ఒక సంస్థ వచ్చినప్పుడు ఎలా నమ్మారంటూ పేర్కొంటున్నారు. కావాలనే నాణ్యత లేని నెయ్యి వినియోగించి ప్రసాదాన్ని తయారు చేశారంటూ విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం వైసీపీని ఇరకాటంలోకి నెట్టింది. వైసిపి సోషల్ మీడియా డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రయోజనం లేకుండా పోయిందని చెబుతున్నారు.

అయితే ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపడం ద్వారా మరిన్ని వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతానికి భక్తుల మనోభావాలను ఆధారంగా చేసుకుని ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారినప్పటికీ ఎన్నికల నాటికి ఇటువంటివి కనీసం చర్చకు కూడా రావని పలువురు చెబుతున్నారు. మత ప్రాతిపదికన చేసే రాజకీయాలకు దేశంలో తావులేదని, అలా ఉంటే అయోధ్యలో బిజెపి ఓడిపోయేదే కాదని పలువురు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారాన్ని వైసిపి సానుభూతిపరులు మరో విధంగా విశ్లేషిస్తున్నారు. విజయవాడలో వరదలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్లక్ష్యమే కారణం అన్న చర్చ జరుగుతోంది. వర్షాలకు నాలుగు రోజుల ముందు ఐఎండీ హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే వరదల వల్ల విజయవాడలోని వేలాది మంది ఇబ్బందులు గురికావాల్సి వచ్చిందని, ఈ టాపిక్ నుంచి ప్రజలను డైవర్ట్ చేసే ఉద్దేశంతోనే టిడిపి కావాలనే లడ్డు వివాదాన్ని తెరపైకి తీసుకు వచ్చినట్లు చెబుతున్నారు. రెండు నెలల కిందట లడ్డు పరీక్షలకు పంపించిన నివేదిక వస్తే ఇప్పుడు దానిని బహిర్గతం చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ వివాదం ఎటువైపు మలుపు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలంటే డిమాండ్ వినిపిస్తోంది. గవర్నర్ ను కలిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కూడా సిబిఐ విచారణ జరిపించాలంటూ వినతి పత్రాన్ని సమర్పించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్