వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ బలోపేతానికి కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. గడిచిన ఎన్నికల్లో తమ పార్టీకి దూరమైన కొన్ని వర్గాలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు.
వైసిపి కాపు నేతల సమావేశం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ బలోపేతానికి కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. గడిచిన ఎన్నికల్లో తమ పార్టీకి దూరమైన కొన్ని వర్గాలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండే కాపు సామాజిక వర్గం గడిచిన ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు వల్ల కూటమికి దగ్గరయ్యారు. ఈ కారణాలతో వైసిపికి దూరమైన కాపులను మళ్లీ దగ్గర చేసుకునే ప్రయత్నాలను వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలోని కీలక పదవులను ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే శాసనమండలి ప్రతిపక్షనేతగా కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు అవకాశం కల్పించారు. అలాగే ఈయనకే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలను అప్పగించారు. అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రీజనల్ కోఆర్డినేటర్ గా కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత కురసాల కన్నబాబును తాజాగా నియమించారు.
అలాగే తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా దాడిశెట్టి రాజా, గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా అంబటి రాంబాబు వంటి కాపు నేతలకు బాధ్యతలను అప్పగించారు. అలాగే కాపు ఉద్యమనేతగా పేరుగాంచిన ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలో ముఖ్యమైన నేతగా భావించి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొద్దిరోజుల కిందట ఆయన ఇంటిపై ఒక వ్యక్తి దాడి చేయడంతో వైసీపీకి చెందిన కాపు నేతలంతా వెళ్లి ఆయనను పరామర్శించారు. అలాగే మిగిలిన కాపు నేతలకు కూడా పార్టీలో కీలకమైన బాధ్యతలను అప్పగించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన ఎన్నికల్లో పార్టీకి దూరమైన కాపులను కొంతైనా మళ్లీ దగ్గరకు చేర్చుకోవాలని ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీలో కాపులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాపులకు కీలక బాధ్యతలను అప్పగించేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఒకవైపు పార్టీలో కాపులకు ప్రాధాన్యతనిస్తూనే మరోవైపు బలమైన నేతలను నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా నియమిస్తున్నారు. 2029 ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎంతోమంది బలమైన నేతలు వైసిపికి దూరమయ్యారు. అటువంటివారిని దగ్గర చేసుకునే ప్రయత్నాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వ హయాంలో రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిర్ణయాలు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యాపారులపై సాగిస్తున్న కక్ష సాధింపులు వంటివన్నీ ఇప్పుడు రెడ్ సామాజిక వర్గ నేతల్లో ఆలోచనలకు కారణమవుతున్నట్లు చెబుతున్నారు.
ఈ కక్ష సాధింపు ధోరణి వల్లే చాలామంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలు కొద్దిరోజుల్లోనే వైసీపీలో చేరుతారని చెబుతున్నారు. ఆ తర్వాత కూటమిలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ముఖ్య నాయకులు కూడా వైసిపి వైపు మళ్ళీ వస్తారని వైసీపీకి చెందిన కొందరు ముఖ్య నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనా వైయస్ జగన్మోహన్ రెడ్డి 2029 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాపు, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన నేతలను, ఓటర్లను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలం అవుతాయో చూడాల్సి ఉంది.