||రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మహిళలు||
ఈవార్తలు, జగిత్యాల జిల్లా: తెలంగాణలో మహిళల హవా నడుస్తోంది. ఏ బస్సు ఎక్కినా టికెట్ లేకుండానే ప్రయాణం చేసే వీలు కలగడంతో రాష్ట్రంలోని అన్ని బస్సులు, బస్ స్టేషన్లు మహిళలతో కిటకిటలాడుతున్నాయి. ఏ బస్సు చూసినా అధికులు మహిళలే ప్రయాణిస్తున్నారు. అయితే, మహిళా సాధికారత సాధించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మహిళా లోకం స్వాగతిస్తోంది. అధికారం చేపట్టిన వారంలోపే గొప్ప నిర్ణయం తీసుకుందని కొనియాడుతున్నారు. ఎంతో మంది పేద, మధ్యతరగతి మహిళలకు ఈ పథకం ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ‘మహాలక్ష్మి’ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు తాజాగా జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఐకేపీ వీవోఏలు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎంతో మంది మహిళలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్‌కు, చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళల కోసం మరిన్ని మంచి పథకాలు తీసుకురావాలని కోరారు. వీలైనంత త్వరగా ప్రతి మహిళకు రూ.2,500 అందించే పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్థిక అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.