తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ జరిగేనా.. మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళుతున్న సీఎం రేవంత్ రెడ్డి

మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆశావహ నేతలు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఈనెల 17వ తేదీన సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో మరోసారి క్యాబినెట్ విస్తరణ అంశం చర్చలోకి వచ్చింది. కొత్తగా నియమితుడైన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి ఆయన ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు.

CM Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది గడుస్తోంది. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదం కాగా, అనేక పథకాలు ఆ ప్రభుత్వానికి మంచి పేరును తీసుకువచ్చాయి. ఒకవైపు ప్రభుత్వం సాఫీగా సాగుతోంది. అయితే ఎంతో మంది నేతల్లో అసంతృప్తి మాత్రం గూడు కట్టుకుని ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తమకు అవకాశాలు లభిస్తాయి అని భావించిన ఎంతోమంది సీనియర్ నేతలకు మంత్రి పదవులు దక్కలేదు. అటువంటి వారికి రెండో విడతలో మంత్రి పదవులు లభిస్తాయని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. ఈ హామీని నెరవేర్చాలంటూ అగ్ర నాయకులు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రయోజనం దక్కడం లేదు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా తనకు కావాల్సిన వారికి ఖాళీగా ఉన్న మంత్రి పదవులను కట్టబెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందులో భాగంగానే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఆయన స్థాయిలో ఆయన ప్రయత్నాలు చేపడుతున్నారు. కానీ ఆ ఫలితాలు ఏవి ఇప్పటి వరకు ప్రయోజనాన్ని ఇవ్వలేదు. మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆశావహ నేతలు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఈనెల 17వ తేదీన సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో మరోసారి క్యాబినెట్ విస్తరణ అంశం చర్చలోకి వచ్చింది. కొత్తగా నియమితుడైన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి ఆయన ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. దీంతో క్యాబినెట్ విస్తరణ జరుగుతుందన్న చర్చ జోరుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో జరుగుతోంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగే పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్నప్పటికీ.. ఈ పర్యటనలోనే క్యాబినెట్ విస్తరణకు సంబంధించిన అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ పర్యటనలో విస్తరణకు సంబంధించి ఉన్న అంశాన్ని క్లియర్ చేసుకునే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లి అగ్ర నాయకులను కలిసిన సందర్భంలో దసరా నాటికి క్యాబినెట్ విస్తరణ చేసుకునేలా వెల్లడించారు. కానీ జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిగణలోకి తీసుకోలేదు. దీంతో మరోసారి అగ్ర నాయకులను కలిసి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పర్యటనలోనే మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మంత్రివర్గ విస్తరణ ఉంటే డిసెంబర్ లోగా పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

మంత్రివర్గంలో ప్రస్తుతం ఆరు వరకు ఖాళీలు ఉండగా, ఆశావహ నేతల సంఖ్య మాత్రం డజనుకుపైగానే ఉంది. ఈ నేపథ్యంలో ఎవరెవరికి మంత్రివర్గంలో బెర్త్ కన్ఫామ్ అవుతుంది అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి కోటాలో తనకు కావాల్సిన ముగ్గురు నేతలకు మంత్రి పదవులను కట్టబెట్టాలని ఆయన భావిస్తున్నారు. మరో ఇద్దరు ముగ్గురు ముఖ్య నాయకులు కూడా తమదైన స్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇచ్చి మరిన్ని ఇబ్బందులను తెచ్చుకోవడం అవసరమా అన్న ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉండడం వల్లే ఈ ప్రక్రియ ఆలస్యం అవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విస్తరణ ప్రక్రియను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఈసారి ఢిల్లీ పర్యటనలోనే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందా.? లేదా.? అన్నది చూడాల్సి ఉంది. మంత్రి పదవులను ఆశిస్తున్న నేతల జాబితాలో ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్, తుంగతుర్తి ఎమ్మెల్యే శామ్యూల్, మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు తదితరులు ఆశలు పెట్టుకున్నారు. వీరితోపాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్,  బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే, చెన్నూరు ఎమ్మెల్యే, మాల సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత గడ్డం వివేక్, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ గట్టిగానే ప్రయత్నాలను సాగిస్తున్నారు. ముదిరాజ్ కోటాలో అదే సామాజిక వర్గానికి చెందిన శ్రీహరి ముదిరాజ్ కు అవకాశం ఉంటుందని జోరుగా చర్చ జరుగుతోంది. అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా కేబినెట్ బెర్తు కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్