తెలంగాణలో గడిచిన ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని పాలన అధ్వానంగా తయారైందని, 6 గ్యారంటీలను ఇంకెప్పుడూ అమలు చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన సోమవారం స్పందించారు. ఏడాది పాలనలో ఎనలేని అప్పులు మిగిలాయని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు అమలయిందే లేదని, కానీ లెక్కకు మించిన అప్పులు మాత్రం చేస్తున్నారని దుయ్యబట్టారు. పిడికెడు మన్ను తీసింది లేదని, కొత్తగా కట్టింది కూడా లేదన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణలో గడిచిన ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని పాలన అధ్వానంగా తయారైందని, 6 గ్యారంటీలను ఇంకెప్పుడూ అమలు చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన సోమవారం స్పందించారు. ఏడాది పాలనలో ఎనలేని అప్పులు మిగిలాయని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు అమలయిందే లేదని, కానీ లెక్కకు మించిన అప్పులు మాత్రం చేస్తున్నారని దుయ్యబట్టారు. పిడికెడు మన్ను తీసింది లేదని, కొత్తగా కట్టింది కూడా లేదన్నారు. అయినప్పటికీ అప్పుడే లక్షన్నర కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. రుణమాఫీ చేసింది లేదని, కోట్ల అప్పు ఎందుకయిందని విమర్శించారు. రైతు భరోసా ఇయ్యనేలేదని, లక్షన్నర కోట్లు ఎవ్వరి పాలయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. రెండు వేల ఫించను నాలుగు వేలు కానేలేదని, అప్పు తెచ్చిన కోట్లు ఎవ్వరిపాలు చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకం కింద ఆడ బిడ్డలకు రూ.2500 ఊసేలేదని లక్షన్నర కోట్ల అప్పు ఎందుకయిందని ఆరోపించారు. తులం బంగారానికి దిక్కేలేదని, లక్షన్నర కోట్ల అప్పులో రాష్ట్ర సర్కార్ ఉందంటూ విమర్శించారు. కేసీఆర్ కిట్టు లేదని, న్యూట్రిషన్ కిట్ రాలేదన్నారు.
కాళేశ్వరం కట్టి, పాలమూరు, రంగారెడ్డి కట్టి, సీతారామ సాగర్ కట్టి, వందల టీఎంసీల రిజర్వాయర్లు నిర్మించి, మిషన్ కాకతీయ కింద చెరువులు, కుంటలు బాగుచేసి మిషన్ భగీరధ కింది ఇంటింటికి మంచి నీళ్లిచ్చిన తాము కూడా ఏడాదికాలంలో ఇన్ని అప్పులు చేయలేదన్నారు. రైతుబంధు, రైతుబీమా, కళ్యాణ లక్ష్మి, ఆసరా ఫించన్లతో అండగా నిలిచిన తాము, వెయ్యికిపైగా సంక్షేమ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి హరిత హారంతో పచ్చదనం పెంచామని, రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి అన్ని రంగాలలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టి దశదిశలా తెలంగాణ వైభవాన్ని చాటామన్నారు. పదేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్ ప్రభుత్వంపై విషప్రచారం చేసిన సన్నాసులు.. కేవలం ఏడాది పాలనలో చేసిన లక్షన్నర కోట్ల అప్పు గురించి ఎందుకు ప్రశ్నించారని ఎద్దేవా చేశారు.
వార్డు మెంబర్ కానీ వ్యక్తికి సీఎం స్థాయి అధికారాలా.?
కనీసం వార్డు మెంబెర్ గా కూడా గెలవని వ్యక్తికి సీఎం స్థాయి అధికారాలు అంటే ఎనుముల రాచరిక పాలనలో మాత్రమే జరుగుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలో జరగదని స్పష్టం చేశారు. ఎమెల్యే బదులు అధికార కార్యక్రమాలలో పాల్గొనడానికి తిరుపతి రెడ్డి ఎవరంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీని ఏ అధికారంతో చేస్తున్నారని ప్రశ్నించారు. రెండు కాన్వాయ్లు, గన్ మెన్లు, ప్రోటోకాల్ తో సంబంధం లేకుండా విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపించారు. కొడంగల్ కి కొత్త ఎంఎల్ఏ కావాలని ప్రజలు అనుకుంటే ఎన్నికలు నిర్వహిస్తే సరిపోతుంది కదా అంటూ పేర్కొన్నారు. ఈ రాజ్యాంగేతర వ్యవస్థ దేనికని, ఈ కుటుంబం పాలన దేనికి సంకేతమని ప్రశ్నించారు కేటీఆర్. భారత రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీకి ఇక్కడ వ్యవహారాలు తెలుసా.? అంటూ ప్రశ్నించారు.