జగన్మోహన్ రెడ్డిపై చిన్నపాటి ఆరోపణ వచ్చినా తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోసే కూటమి నాయకులు అదానీ విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై మాత్రం మాట్లాడడం లేదు. కనీస స్థాయిలో స్పందన కూడా కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గడచిన ఐదేళ్లుగా రాష్ట్రంలోని అన్ని విభాగాలను అస్తవ్యస్తం చేయడంతో పాటు అవినీతికి పాల్పడ్డారంటూ కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డిపై గడిచిన కొన్ని నెలలుగా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి, సీఎం చంద్రబాబు
దేశ వ్యాప్తంగా గడిచిన కొద్ది రోజుల నుంచి ప్రకంపనలు సృష్టిస్తున్న అదానీ విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై రచ్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా అలానే అనేక రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకున్నారని, ఇందుకోసం చాలామందికి ముడుపులు ఇచ్చారంటూ అమెరికాలోని ఎఫ్బీఐ, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అమెరికాలో కోర్టుకు నివేదిక సమర్పించాయి. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా అగ్గి రాజేసింది. గడిచిన కొన్నాళ్లుగా ఆదానీ వ్యవహారంపై తీవ్రస్థాయిలో ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు అస్త్రం దొరికినట్టు అయింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో ఇదే విషయంపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఈ ఒప్పందంలో భారీగా చేతులు మారాయి అంటూ సదర సంస్థలు అమెరికా కోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించాయి. ఇదే విషయాన్ని పట్టుకొని రాష్ట్రంలోని కొన్ని మీడియా ఛానల్స్ పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని కథనాలు రాస్తున్నాయి. సుమారు రూ.1750 కోట్ల రూపాయల లంచాన్ని ఇచ్చి అదాని ఈ ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్నారని, నిబంధనలను అతిక్రమించి భారీ మొత్తంలో చెల్లించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ మేరకు ఒప్పందాలు చేసుకుందంటూ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
కూటమి నేతల సైలెన్స్ దేనికి సంకేతం..
జగన్మోహన్ రెడ్డిపై చిన్నపాటి ఆరోపణ వచ్చినా తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోసే కూటమి నాయకులు ఈ విషయంలో మాత్రం మాట్లాడడం లేదు. కనీస స్థాయిలో స్పందన కూడా కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గడచిన ఐదేళ్లుగా రాష్ట్రంలోని అన్ని విభాగాలను అస్తవ్యస్తం చేయడంతో పాటు అవినీతికి పాల్పడ్డారంటూ కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డిపై గడిచిన కొన్ని నెలలుగా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఇసుక, మద్యం, మైనింగ్ వంటి అన్ని శాఖల్లోనూ భారీగా జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారు అంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ తరహా ఆరోపణలు చేస్తున్న కూటమి నాయకులకు అదానీ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు కనిపించకపోవడం గమనార్హం. తమ సొంత మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నప్పటికీ కూటమి నాయకులు మాత్రం దీని గురించి కనీసం స్పందించడం లేదు.
ఇదే ఇప్పుడు ప్రజలను ఆలోచనకు గురిచేస్తుంది. చిన్న చిన్న తప్పిదాలకు జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శల గుప్పించే కూటమి నాయకులు.. ఈ స్థాయిలో అవినీతి జరిగింది అంటూ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని కూటమి నాయకులు ఎందుకు స్పందించలేకపోతున్నారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనికి ప్రధాన కారణం బిజెపిలోని అగ్ర నాయకులతో అదానికి ఉన్న సత్సంబంధాలే కారణంగా భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాకు అదాని అత్యంత సన్నిహితుడు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై ఏదైనా వ్యాఖ్యలు చేస్తే కేంద్రంలోని ఉన్న ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే రాష్ట్రంలోని కూటమి నాయకులు వ్యూహాత్మకంగానే మౌనం దాల్చినట్లు చెబుతున్నారు. ఈ మౌనమే జగన్మోహన్ రెడ్డికి సానుకూలంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు కూటమికి అనుకూలంగా ఉండే మీడియా పెద్ద ఎత్తున కథనాలు ప్రచురిస్తున్న.. ఓటమి నాయకులు ఆ స్థాయిలో ఆరోపణలు చేయకపోవడంతో ప్రజల్లో కూడా దీనిపై పెద్దగా చర్చ జరగడం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఏం జరిగిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండడం కొంతవరకు సఫలీకృతం అయినట్లు చెబుతున్నారు.