Weather News | ఎండలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. కాలు తీసి బయట పెట్టాలంటే భయం వేసేంత ప్రతాపంతో భానుడు ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఒక శుభవార్త చెప్పింది.
ఈవార్తలు, వాతావరణం: ఎండలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. కాలు తీసి బయట పెట్టాలంటే భయం వేసేంత ప్రతాపంతో భానుడు ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఒక శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రాబోయే మూడురోజుల పాటు పలు జిల్లాలో వడగాడ్పులు, పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో వడగాడ్పులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
సోమవారం వనపర్తి, జోగులాంబ గద్వాలలో వడగాలులు వీస్తాయని చెప్పింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వానలు పడే అవకాశం ఉందని వివరించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం పలుచోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు సహా ములుగు, భూపాలపల్లి, మెదక్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని పేర్కొంది.