బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సహా పలు నగరాలు హింసాత్మకంగా మారాయి. ఢాకా సహా పలు నగరాల్లో దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతో పాటు పలు నగరాలు హింసాత్మకంగా మారాయి. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు షేక్ హసీనా ప్రభుత్వం ప్రకటించింది. గత నెలలో ప్రారంభమైన ప్రస్తుత నిరసనల సందర్భంగా మొదటిసారి ఇటువంటి చర్య తీసుకున్నారు. బంగ్లాదేశ్‌లో నిరసనలు, హింసను దృష్టిలో ఉంచుకుని, భారత ప్రభుత్వం కూడా తన పౌరులకు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బంగ్లాదేశ్‌కు వెళ్లవద్దని భారతీయ పౌరులకు సూచించింది.
భారత హైకమిషన్ హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ :
దీనితో పాటు, ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయ పౌరులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. వారు తమ కదలికలను పరిమితం చేయాలని..ఢాకాలోని భారత హైకమిషన్‌తో అత్యవసర ఫోన్ నంబర్‌ల ద్వారా టచ్‌లో ఉండాలని సూచించారు. ఇందుకోసం బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్ ఫోన్ నంబర్లను జారీ చేసింది. ఈ సంఖ్యలు +8801958383679, +8801958383680, +8801937400591.
ఇప్పటివరకు 100 మందికి పైగా దుర్మరణం:
రాజధాని ఢాకాతో సహా బంగ్లాదేశ్‌లోని అనేక నగరాల్లో ఆదివారం మరోసారి హింస చెలరేగింది. హింసాకాండ కారణంగా ఇప్పటివరకు 100 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఆదివారం విద్యార్థుల ఆందోళనకారులు పోలీసులకు, అధికార పార్టీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు.
ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు డిమాండ్
నిరసనలో పాల్గొన్న విద్యార్థులందరూ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వేలాది మంది నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. స్టన్ గ్రెనేడ్‌లను కూడా ప్రయోగించారు.
షేక్ హసీనా 15 ఏళ్లుగా ప్రభుత్వంలో ఉన్నారు
ప్రధాని షేక్ హసీనాకు ఈ నిరసనలు పెద్ద సవాల్‌గా మారాయి. జనవరిలో షేక్ హసీనా వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చారు. బంగ్లాదేశ్‌ను 15 ఏళ్లకు పైగా పాలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హసీనా ప్రభుత్వం పతనం అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. నిరసనకారులందరూ ఒకే డిమాండ్‌పై మొండిగా ఉన్నారు: షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలి.