అమెరికాలో వచ్చే నెలలో కొలువుదీరనున్న డోనాల్డ్ ట్రంప్ సర్కారు అక్రమ వలసదారులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అమెరికాలో ఉన్న కొన్ని వేల మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు పంపించేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమవుతోంది. తప్పుడు పత్రాలతో అమెరికాకు వచ్చిన వారి చిట్టాను ఇప్పటికే సర్కారు సిద్ధం చేసింది. ఈ కోవలోనే 14.45 లక్షల మంది ఉండగా వీరిలో భారతీయుల సంఖ్య సుమారు 19 వేల వరకు ఉన్నట్లు అక్కడ అధికారులు గుర్తించారు.
డోనాల్డ్ ట్రంప్
అమెరికాలో వచ్చే నెలలో కొలువుదీరనున్న డోనాల్డ్ ట్రంప్ సర్కారు అక్రమ వలసదారులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అమెరికాలో ఉన్న కొన్ని వేల మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు పంపించేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమవుతోంది. తప్పుడు పత్రాలతో అమెరికాకు వచ్చిన వారి చిట్టాను ఇప్పటికే సర్కారు సిద్ధం చేసింది. ఈ కోవలోనే 14.45 లక్షల మంది ఉండగా వీరిలో భారతీయుల సంఖ్య సుమారు 19 వేల వరకు ఉన్నట్లు అక్కడ అధికారులు గుర్తించారు. వీరందరినీ తిరిగి పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) వెల్లడించింది. ట్రంప్ కూడా ఇటీవల టైం మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మిలటరీ (నేషనల్ గాడ్స్) ను సాధారణంగా ఇలాంటి పనులకు వినియోగించరు కదా అని ఆయనను టైం ప్రతినిధి ప్రశ్నించగా అమెరికాలోకి అక్రమంగా చొరబాట్లు జరిగాయని, ఇది అమెరికాపై దురాక్రమంగా భావిస్తామన్నారు. పలు దేశాలు ఈ విషయంలో తమకు సహకరించడం లేదని ట్రంపు స్పష్టం చేశారు. తాము గుర్తించిన వ్యక్తుల పౌరసత్వం వివరాలు అడిగామని కానీ స్పందన లేదన్నారు.
అలాంటి 15 దేశాలను సహకరించడం లేదు అనే జాబితాలో పెట్టినట్లు వెల్లడించారు. ఆ దేశాలు సహకరించకపోతే నేషనల్ గాడ్స్ సాయంతో వారిని తిప్పి పంపుతామన్నారు. కాగా, భారత్ కూడా బహిష్కరణ కోసం 18,000 మంది వివరాలు అడిగితే ఇవ్వడంలేదని ఐసిఈ పేర్కొంది. అమెరికాలో తప్పుడు పత్రాలతో నివసిస్తున్న భారతీయుల్లో ఎక్కువగా పంజాబ్, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారు ఉన్నట్లు వివరించింది. పాకిస్తాన్, చైనా, ఇరాన్, వెనుజులా నుంచి సహకారం అందడం లేదని తెలిపింది. ఇదే జరిగితే భారతకు చెందిన కొన్ని వేలమంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికాలోనే అనేక ప్రాంతాల్లో భారతీయులు ఉన్నారు. వీరంతా చదువులు, ఉద్యోగాల కోసం అమెరికాకు ఇలా అడ్డదారుల్లో వెళ్లారు. ఇప్పుడు ట్రంప్ సర్కార్ అటువంటి వారిపైనే దృష్టి సారించడంతో వారంతా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా నుంచి వారిని భారతకు తరలించే ప్రక్రియలో ఏమైనా న్యాయపరమైన చిక్కులకు అవకాశం ఉంటుందా అన్నదానిపైన కూడా చర్చ జరుగుతుంది.
మరోవైపు డోనాల్డ్ ట్రంప్ కు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. క్రిమినల్ కేసులు ఏవి లేకుండా అధ్యక్ష పీఠంపై కూర్చోవాలనే తన ఆశకు కోర్టు నిర్ణయంతో బ్రేక్ పడింది. అధ్యక్షుడికి ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా కేసులో తీర్పును కొట్టేయాలని తాజాగా ట్రంప్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను మన్ హటన్ కోర్టు జడ్జ్ జస్టిస్ జువాన్ మర్కన్ తిరస్కరించారు. న్యూయార్క్ స్టేట్ కేసును ముందస్తుగా మూసి వేయడానికి నిరాకరించారు. ఆ కేసు ట్రంప్ వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించినదని, అది ఆయన అధికార కార్యక్రమాలకు చెందినది కాదని పేర్కొంటూ పిటిషన్ ను తిరస్కరించారు.