ఏప్రిల్ 1 అనగా నేటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అనేక కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బడ్జెట్‌లో ప్రకటించినట్టు ఆదాయపు పన్ను మార్పులు, నూతన శ్లాబులు అమల్లోకి వచ్చేశాయి.
ప్రతీకాత్మక చిత్రం
ఈవార్తలు, బిజినెస్ న్యూస్ : ఏప్రిల్ 1 అనగా నేటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అనేక కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బడ్జెట్‌లో ప్రకటించినట్టు ఆదాయపు పన్ను మార్పులు, నూతన శ్లాబులు అమల్లోకి వచ్చేశాయి. ఈ మార్పులు పన్ను చెల్లింపులు, బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్, గ్యాస్ సిలిండర్ ధరలు, క్రెడిట్ కార్డ్ పాయింట్లు సహా తదితర అంశాలపై ప్రభావం చూపించబోతున్నాయి. క్రెడిట్ కార్డ్ రివార్డులు, యూపీఐ సేవల నిబంధనలు కూడా మారుతాయి. ఆ వివరాలేంటంటే..
1. ఆదాయపు పన్ను మినహాయింపు పెంపు: ఆదాయపు పన్ను విధానంలో కేంద్రం మార్పులు చేసింది. అవి 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమలు కానున్నాయి. ప్రస్తుత పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందులో, వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000 కలుపుకొని, మొత్తం రూ.12.75 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా ఉంటుంది. ఇది మధ్యతరగతి వర్గానికి ఊరటనిస్తుంది.
2. టీడీఎస్, టీసీఎస్ నియమాల్లో మార్పులు: భారతదేశంలో డివిడెండ్ ఆదాయంపై టీడీఎస్ పరిమితి రూ.5,000 నుంచి రూ.10,000కి పెరుగుతుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్యాంకుల్లోని డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు జమ అయ్యే వార్షిక వడ్డీ రూ.50,000 దాటితే దానిపై మూలం వద్ద పన్ను వసూలు చేస్తున్నారు. 60 ఏళ్ల లోపు వ్యక్తులకు ఈ మొత్తాన్ని రూ.40,000 నుంచి రూ.50,000కు పెంచారు. ఇదే విధంగా, మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై వచ్చే ఆదాయంపై కూడా టీడీఎస్ పరిమితి రూ.5,000 నుంచి రూ.10,000కి చేరుతుంది. విద్యా రుణాలపై టీసీఎస్ మినహాయింపును తొలగించారు. ఈ మార్పుల ప్రకారం, రూ.7 లక్షలకు మించిన విద్యా లావాదేవీలపై 5 శాతం టీసీఎస్ విధిస్తారు. విదేశీ చెల్లింపుల పరిమితి కూడా మారుతుంది. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విదేశీ చెల్లింపుల పరిమితి రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెరుగుతుంది.
3. యూపీఐ సేవల్లో మార్పులు: జాతీయ చెల్లింపు సంస్థ (NPCI).. 2025 ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవలలో కొన్ని మార్పులు చేసింది. ఇకపై, ఇన్‌యాక్టివ్ మొబైల్ నంబర్లకు లేదా ఇతరులకు కేటాయించిన నంబర్లకు యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్ సేవలందించే ప్రొవైడర్లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోవడం ద్వారా అనధికారిక వాడకాన్ని, మోసాలను ఆరికట్టేందుకు ఆ నంబర్లను డీయాక్టివ్ చేయాలని సూచించింది.
4. జీఎస్‌టీ నియమాలు: ఇన్‌పుట్ టాక్స్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ (ISD) తప్పనిసరిగా అమలు అవుతుంది. దీని ద్వారా వ్యాపారాలపై కొత్త పన్నుల ప్రభావం ఉంటుంది. చిన్న వ్యాపారాలపై ఎక్కువగా ప్రభావం చూపవచ్చని వాణిజ్య రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
5. ఏటీఎం, బ్యాంకింగ్ చార్జీలు: ఏటీఎంలలో నగదు ఉపసంహరణ చార్జీల్లో మార్పులు చేశారు. కొన్ని బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ నియమాల్లోనూ మార్పులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఖాతాదారులు తమ ఖాతా నిర్వహణలో మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
6. క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లలో మార్పులు: ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల నిబంధనల్లో మార్పులు చేస్తున్నాయి. దీనివల్ల కొన్ని లావాదేవీలపై రివార్డులు తగ్గే అవకాశం ఉన్నది.
7. రూపే డెబిట్ కార్డ్ నియమాలు: రూపే డెబిట్ కార్డులపైనా కొన్ని మార్పులు చేశారు. విమానాశ్రయాల్లో లాంజ్ యాక్సెస్, బీమా సదుపాయం, ప్రయాణం, ఫిట్‌నెస్ వంటి సౌలభ్యాలను కల్పించి, వినియోగదారులకు సేవలు అందించనున్నారు.
8. గ్యాస్ సిలిండర్ ధరల మార్పు: ప్రతి నెల 1న చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను మార్పు చేస్తాయి. ఈ మార్పు అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా జరుగుతుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం లేదా తగ్గడం అనేది జరుగుతుంది.