కోల్ కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న హత్యాచార ఘటన విచారణ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా ఈ ఘటనను నిరసిస్తూ ఆందోళనలో జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిత్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసు పై మంగళవారం విచారణ జరుపనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు వెబ్సైట్లో వివరాలను వెల్లడించారు.
సుప్రీంకోర్టు
కోల్ కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న హత్యాచార ఘటన విచారణ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా ఈ ఘటనను నిరసిస్తూ ఆందోళనలో జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిత్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసు పై మంగళవారం విచారణ జరుపనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు వెబ్సైట్లో వివరాలను వెల్లడించారు. ఈ కేసుపై ఇప్పటికే సిబిఐ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు జూనియర్ డాక్టర్ పై దారుణంగా లైంగిక దాటిక పాల్పడి హత్య చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్ కి ఆదివారం మానసిక పరీక్షలు జరిపారు. ఢిల్లీ నుంచి కోల్ కతాకు వచ్చిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ కి చెందిన మానసిక విశ్లేషకులు ఈ పరీక్షలు నిర్వహించారు. కోల్ కతా పోలీస్ విభాగంలో పౌర వాలంటీర్ గా 2019లో చేరిన సంజయ్ రాయ్ ఇప్పటికే నాలుగు సార్లు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అతడు ఒక తిరుగుబోతు అని, బాక్సింగ్ లో ప్రవేశం ఉందని వెళ్లడైంది. తాజా ఘటన అనంతరం ఆర్జి కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ పదవి నుంచి వైదొలిగిన సందీప్ ఘోష్ ను సిబిఐ అధికారులు ఆదివారం కూడా విచారించారు. ఆయన ఫోన్ కాల్స్ వివరాలను పరిశీలిస్తున్నారు. అత్యాచారం ఘటన జరిగిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో సిబిఐ దర్యాప్తు బృందం త్రీడీ లేజర్ మ్యాపింగ్ నిర్వహించింది. అత్యాచారానికి బలైన జూనియర్ డాక్టర్ పేరు వెల్లడిస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సినీనటి రచన బెనర్జీపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆమె ఆ వీడియోను తొలగించి క్షమాపణలు చెప్పారు. ఇదిలా ఉంటే కోల్ కతా ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు జోక్యంతో మరింత వేగవంతం
ఈ కేసులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో విచారణ వీలైనంత వేగంగా కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో పెద్దలు ఉన్నారన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సహకారాన్ని అందించకపోవడం కూడా విచారణకు ఇబ్బందు కలుగుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో పశ్చిమబెంగాల్ హైకోర్టు కూడా కలుగజేసుకుంది. హైకోర్టు ఆదేశాలతోనే సిబిఐకి కేసు విచారణ బాధ్యతను అప్పగించారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవడంతో నిందితులు ఎవరన్న విషయం వీలైనంత వేగంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ కేసును అన్ని విధాలుగా పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు అవకాశం లభిస్తున్నట్టుగానే భావించాలి. మరోవైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆమె విచారణ జరిపించాల్సింది పోయి.. న్యాయం చేయాలంటూ నిరసన చేయడంపై సామాజిక మాధ్యమాలు వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఈ హత్యాచార ఘటనకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం మమతా బెనర్జీ, ప్రభుత్వం ఈ కేసు విచారణ పట్ల వ్యవహరిస్తున్న తీరును సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మౌనాన్ని దాల్చుతున్నారు. కొద్దిరోజుల కిందట మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కేసులో ఎంత పెద్దవారు ఉన్నా తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన డిమాండ్ కు అనుగుణంగా చర్యలు చేపట్టకపోవడంతో ఆయన మౌనాన్ని ఆశ్రయించారు. ఆయనతోపాటు మరికొంతమంది కూడా ప్రభుత్వం పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.