గడచిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలుగుదేశం నేతృత్వంలోనే కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నామినేటెడ్ పోస్టులు సుమారు 2500 వరకు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. వీటిని భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిరోజులు కిందట యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేశారు. నామినేటెడ్ పోస్టులు కావాలనుకునే నాయకులు, కార్యకర్తలు దరఖాస్తులు చేసుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ కొద్దిరోజుల కిందట పిలుపునిచ్చింది.
సీఎం చంద్రబాబు నాయుడు
గడచిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలుగుదేశం నేతృత్వంలోనే కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నామినేటెడ్ పోస్టులు సుమారు 2500 వరకు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. వీటిని భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిరోజులు కిందట యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేశారు. నామినేటెడ్ పోస్టులు కావాలనుకునే నాయకులు, కార్యకర్తలు దరఖాస్తులు చేసుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ కొద్దిరోజుల కిందట పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 23 వేల మంది ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో గడిచిన ఐదేళ్లు పార్టీ కోసం పని చేసిన వారిని గుర్తించి వారికి కీలక బాధ్యతలను అప్పగించనున్నారు. ఈ నామినేటెడ్ పోస్టుల్లో 25 శాతం వరకు భాగస్వామి పక్షంగా ఉన్న జనసేనకు ఇవ్వనున్నారు. బిజెపికి కూడా కొన్ని నామినేటెడ్ పదవులను ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించారు. ఈ క్రమంలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి అవకాశం బీసీ వర్గానికి చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి కృష్ణయ్యకు దక్కింది. ఆయనను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ)కి అధ్యక్షుడిగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పదవిలో గత జగన్ ప్రభుత్వం రిటైర్డ్ సిఎస్ సమీర్ శర్మను నియమించింది. వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆయన రాజీనామా చేయడంతో కూటమి ప్రభుత్వం కృష్ణయ్యకు అవకాశం ఇచ్చింది.
టిడిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయన ఆ పార్టీ కీలక అంతర్గత బృందంలో సభ్యుడుగా పని చేశారు. బాధ్యతలను స్వీకరించడానికి ముందు ఆయన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. వీటితోపాటు మరో 10 కీలక పదవులు భర్తీకి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిత్రపక్షల ఆమోదంతో కొద్దిరోజుల్లోనే ఉత్తర్వులు జారీ అవుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మిత్ర పక్షాలకు సీట్ల కేటాయింపు వల్ల అవకాశం కోల్పోయిన టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిలకు నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్ర స్థాయిలో కీలకంగా పని చేసిన ఒకరిద్దరికి కూడా చోటు లభించనున్నట్లు సమాచారం. విడతల వారీగా పోస్టుల భర్తీ ఉంటుందని, ప్రాంతాలు, సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకొని కీలక స్థానాలను కట్టబెడతామని టీడీపీ అధినేత చెబుతున్నారు. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి జనసేన కూడా భారీగానే ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో అనేకచోట్ల జనసేన నాయకులు సీట్లను త్యాగాలు చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో కూటమి విజయం కోసం ఆయా నేతలు కృషి చేశారు. అటువంటి వారికి ప్రస్తుతం మేలు చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పై ఉంది. నామినేటెడ్ పోస్టులు భర్తీలో జనసేన వాయిస్ ను బలంగా ప్రజల్లోకి తీసుకెళుతున్న ముఖ్య నాయకులకు తొలి విడతలో ప్రాధాన్యం ఉండేలా పవన్ కళ్యాణ్ జాగ్రత్త తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే జనసేన నుంచి ఎవరెవరికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని జాబితాను సీఎం చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల్లోనే ప్రారంభించడం ద్వారా మూడు పార్టీ శ్రేణుల్లోను ఉత్సాహాన్ని నింపేందుకు అవకాశం ఉంటుందని ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో వారం రోజుల్లోనే ఈ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చని చెబుతున్నారు.