ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలకమైన కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రతిపాదించిన పీ ఫోర్ కార్యక్రమాన్ని ఉగాది నుంచి ప్రారంభించనున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలకు అదనంగా ఈ నూతన విధానాన్ని అమలు చేయనుంది. దీనికి సంబంధించి పీ ఫోర్ కుటుంబ సాధికారత ప్రయోజనాల నిర్వహణ వ్యవస్థపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఈ మేరకు ఉగాది నుంచి దీన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలకు.. ఆర్థికంగా మెరుగ్గా ఉన్న కుటుంబాలు ఆర్థిక చేయతనివ్వడమే ఈ విధాన ముఖ్య ఉద్దేశం.
సీఎం చంద్రబాబు
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలకమైన కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రతిపాదించిన పీ ఫోర్ కార్యక్రమాన్ని ఉగాది నుంచి ప్రారంభించనున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలకు అదనంగా ఈ నూతన విధానాన్ని అమలు చేయనుంది. దీనికి సంబంధించి పీ ఫోర్ కుటుంబ సాధికారత ప్రయోజనాల నిర్వహణ వ్యవస్థపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఈ మేరకు ఉగాది నుంచి దీన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలకు.. ఆర్థికంగా మెరుగ్గా ఉన్న కుటుంబాలు ఆర్థిక చేయతనివ్వడమే ఈ విధాన ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలోని నాలుగు గ్రామాల్లో పీ ఫోర్ విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీని ద్వారా 5,869 కుటుంబాలకు లబ్ది కలుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అర్హత కలిగిన కుటుంబాలను గ్రామ, వార్డు సచివాలయాల్లోని డేటా, కుటుంబ సర్వే, గ్రామసభల ద్వారా ధ్రువీకరిస్తారు. రెండు ఎకరాల మాగాని లేదా ఐదు ఎకరాల మెట్ట భూమి ఉన్న భూ యజమానులను, ప్రభుత్వ ఉద్యోగులను, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారిని, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారు, 200 యూనిట్లు కంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న వారు, మున్సిపల్ ఏరియాలో సొంత ఆస్తి ఉన్నవారు, ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబాలను ఈ కార్యక్రమం నుంచి మినహాయించారు. 40 లక్షల కుటుంబాలు పీ ఫోర్ విధానంలో లబ్ధి పొందేందుకు అర్హులని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది.
కుటుంబ సర్వే మొదటి దశ కింద పది జిల్లాల్లో ఫిబ్రవరి 20 నుంచి చేపట్టిన సర్వే మార్చి రెండో తేదీ నాటికి పూర్తవుతుంది. 52 లక్షల కుటుంబాలకుగాను 27 లక్షల కుటుంబాల సర్వే పూర్తయింది. రెండో దశలో మిగిలిన 16 జిల్లాల్లో మార్చి 8 నుంచి ప్రారంభించి 18 నాటికి పూర్తి చేస్తారు. ఈ 16 జిల్లాల్లో 76 లక్షల కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. ఈ పీ ఫోర్ విధానం అమలులోకి వచ్చిన ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల జాబితాలో ఎలాంటి మార్పులు ఉండవు. లబ్ధిదారుల ధ్రువీకరణ పూర్తయ్యాక సమృద్ధి బంధనం ప్లాట్ ఫామ్ లో ఆ కుటుంబాల వివరాలు పొందుపరుస్తారు. ఈ కుటుంబాల మధ్య జరిగే ఆర్థిక కార్యకలాపాల్లో ఎక్కడ ప్రభుత్వ జోక్యం ఉండదు. కుటుంబాలు, వ్యక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు.
ఈ ప్రోగ్రామ్ లో భాగంగా పీ4 పరిధిలోకి వచ్చే పేదల కుటుంబాలను గుర్తిస్తున్న ప్రభుత్వం.. దాతలను ఎప్పుడూ ఎలా గుర్తిస్తుందో ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఐదు లక్షల కుటుంబాలను ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలన్నది లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సమాంతర వ్యవస్థను నడిపిస్తున్న ఉత్తరాది కన్సల్టెంట్ల భాష ఓ పట్టాను అర్థం కావడం లేదు. పీ ఫోర్ విధానంలో లబ్ధిదారులను, దాతల కుటుంబాలను ఒక్కచోట కలిపేందుకు ఐటి శాఖ రూపొందించిన నివేదికకు సమృద్ధి బంధనం అనే పేరు పెట్టారు. తెలుగు ప్రజల కోసం రూపొందించిన పీ ఫోర్ పథకంతోపాటు వేదిక పేరు కూడా జనాల్లోకి మాత్రం ఆశించినంతగా వెళ్లడం లేదని చెబుతున్నారు. ఏది ఏమైనా నిరుపేదలను ఉన్నత స్థితికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం ఎలా అమలు అవుతుంది అన్నదానిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.