జగన్ ఏ తప్పిదాలు చేసి అధికారాన్ని కోల్పోయారో.. ఇప్పుడు అటువంటి తప్పిదాలనే కూటమి నాయకులు చేస్తుండడం గమనార్హం. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు నాయకులు, మంత్రులు చంద్రబాబును, ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులను హేళన చేస్తూ మాట్లాడారు. 23 స్థానాలకు పడిపోయారంటూ ఎద్దేవా చేశారు. అనేక సందర్భాల్లో నోటి దురుసును కూడా ప్రదర్శించారు. అప్పుడు వైసీపీ నాయకులు చేసిన చేష్టలు, ప్రతిపక్షం పై మాట్లాడిన దుర్భాషలను ప్రజలు సీరియస్ గానే తీసుకున్నారు.
వైసిపి, వైయస్ జగన్మోహన్ రెడ్డి
సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాభవం తరువాత ఆ పార్టీ మునుగడపై సర్వత్ర ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైసిపి.. ఐదేళ్లు గడచిన తర్వాత జరిగిన ఎన్నికల్లో దారుణంగా 11 స్థానాలకు పడిపోయింది. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనానికి సంకేతంగా పలువురు చెబుతూ వచ్చారు. భవిష్యత్తులో వైసిపి మరోసారి అధికారంలోకి రాదు అంటూ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు ఆ పార్టీకి చెందిన నేతలు కూటమి నాయకులు చెబుతూ వస్తున్నారు. ఈ స్థాయిలో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న పార్టీ గురించి ఎవరు పెద్దగా మాట్లాడకపోవడం మంచిది అని అధికార పక్షం భావిస్తుంది. అలా చేయడం వల్లే వైసీపీని ప్రజలు మరిచిపోయేలా చేయవచ్చు. కానీ, కూటమి నాయకులు ఇక్కడే తప్పు చేస్తున్నారు. జగన్ ఏ తప్పిదాలు చేసి అధికారాన్ని కోల్పోయారో.. ఇప్పుడు అటువంటి తప్పిదాలనే కూటమి నాయకులు చేస్తుండడం గమనార్హం. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు నాయకులు, మంత్రులు చంద్రబాబును, ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులను హేళన చేస్తూ మాట్లాడారు. 23 స్థానాలకు పడిపోయారంటూ ఎద్దేవా చేశారు.
అనేక సందర్భాల్లో నోటి దురుసును కూడా ప్రదర్శించారు. అప్పుడు వైసీపీ నాయకులు చేసిన చేష్టలు, ప్రతిపక్షం పై మాట్లాడిన దుర్భాషలను ప్రజలు సీరియస్ గానే తీసుకున్నారు. ఈ స్థాయిలో అహంకారం పనికిరాదు అన్న భావనతోనే చాలామంది గడిపిన ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. గతంలో వైసిపి నిత్యం చంద్రబాబు నాయుడు నామస్మరణ చేయడం వల్ల.. ప్రజల్లో చంద్రబాబు, ఆ పార్టీ పట్ల చర్చకు వైసీపీ నాయకులు అవకాశం కల్పించారు. తత్ఫలితమే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అయితే 2019 నుంచి 2024 మధ్యకాలంలో వైసీపీ చేసిన తప్పిదాన్నే ప్రస్తుతం కూటమి నేతలు చేస్తున్నారు. సాధారణంగా 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన పార్టీ గురించి చర్చించకూడదు. ఆ పార్టీ అధినేత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దీనివల్ల ప్రజలు కూడా సదరు పార్టీ, ఆ పార్టీ నేతలను మరిచిపోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా గతంలో వైసిపి వ్యవహరించినట్టుగానే కూటమి నాయకులు ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు కనీసం ఐదు ఆరుగురు మంత్రులు జగన్మోహన్ రెడ్డి గత పాలనపై విమర్శలు చేస్తున్నారు. ఆయన ఇంటి వ్యవహారాల గురించి పదేపదే మాట్లాడుతున్నారు. నిరంతరం ఆయన పై ఆరోపణలు చేస్తూ అవహేళనగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ మరోసారి ప్రజల్లో చర్చకు కారణం అవుతున్నాయి. సాధారణంగా ఎన్నికలు జరిగిన ఏడాది వరకు ప్రతిపక్షాలు కూడా పెద్దగా స్పందించవు. కానీ అధికార పార్టీ చేస్తున్న దాడి, ఇష్టానుసారంగా మాట్లాడుతున్న మాటలకు వైసీపీ కూడా ఘాటుగానే స్పందిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జగన్మోహన్ రెడ్డి ఓటమిపాలైన నెల రోజులకే రోడ్ ఎక్కిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ లేని రీతిలో 15 సార్లు మీడియాతో మాట్లాడారు. ఇవన్నీ మరోసారి వైసీపీని ప్రజల్లో ఉండేలా చేస్తున్నాయన్న విశ్లేషణలు ఉన్నాయి. గతంలో ఏ తప్పిదాలు అయితే వైసిపి చేసి అధికారాన్ని కోల్పోయిందో.. ఇప్పుడు అటువంటి తప్పిదాలను ఓటమికి చెందిన పార్టీలు చేస్తున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు మాత్రమే పడిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయి అన్న విషయాన్ని కోటమ నాయకులు విస్మరిస్తున్నారు. ఐదేళ్లలో అటు ఇటు జరిగితే ఆరేడు శాతం ఓటు బ్యాంకు మారిన మరోసారి వైసిపి అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదు. తప్పనిసరిగా ఐదేళ్ల పాలన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ప్రస్తుతం కూటమీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, చర్యలతో గతంలో వైసిపి పట్ల అసంతృప్తితో కూటమి పార్టీలకు ఓట్లు వేసిన ఎంతోమంది మరోసారి జగన్ మోహన్ రెడ్డిపై సానుభూతితో వెనక్కి తిరిగే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో గడిచిన ఎన్నికల్లో వైసిపి పట్ల అభిమానం ఉన్నప్పటికీ తమకు ఎటువంటి లబ్ధి చేకూరలేదన్న ఉద్దేశంతో ఎంతోమంది ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కూటమి నాయకులు చేస్తున్న అతితో అటువంటి వారంతా వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ వైపు మొగ్గే ఛాన్స్ ఉంది. అదే సమయంలో అరెస్టులు, దాడులు వంటి వాటితో బాధితులుగా ఉన్న వారంతా వచ్చే ఎన్నికల్లో కసితో వైసిపి పక్షాన పని చేసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి వైసీపీకి కూటమి నాయకులే అవకాశాన్ని కల్పించే విధంగా వ్యవహరిస్తున్నారు అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మరి ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని పాలనపై కూటమి నేతలు దృష్టిసారిస్తారో.. లేదా ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని రాజకీయాలను సాగించి మరోసారి వైసిపి మనుగడ సాగించే అవకాశాన్ని కల్పిస్తారో చూడాలి.