బిగ్ బాస్ షోపై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. సర్వత్ర నెలకొన్న ఆసక్తి.!

గత కొన్నాళ్లుగా బిగ్ బాస్ షో పట్ల అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ షో చూస్తున్న యువత పెడదారి పడుతోందంటూ ఆరోపణలు వస్తున్నాయి. పూర్తిగా బిగ్ బాస్ షోను నిషేధించాలన్న డిమాండు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే యువతను పెడదారి పట్టించడంతోపాటు అశ్లీలత, హింసను ప్రోత్సహించేలా ఉన్న బిగ్ బాస్ రియాలిటీ షో ప్రసారాన్ని నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో తాజాగా వాదనలు ముగిశాయి.

Bigg Boss Show

బిగ్ బాస్ షో 

గత కొన్నాళ్లుగా బిగ్ బాస్ షో పట్ల అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ షో చూస్తున్న యువత పెడదారి పడుతోందంటూ ఆరోపణలు వస్తున్నాయి. పూర్తిగా బిగ్ బాస్ షోను నిషేధించాలన్న డిమాండు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే యువతను పెడదారి పట్టించడంతోపాటు అశ్లీలత, హింసను ప్రోత్సహించేలా ఉన్న బిగ్ బాస్ రియాలిటీ షో ప్రసారాన్ని నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో తాజాగా వాదనలు ముగిశాయి. అయితే తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ప్రకటించింది. బిగ్ బాస్ రియాలిటీ షోను నిలిపివేయాలంటూ సామాజిక కార్యకర్త, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది గుండాల శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన వాదిస్తూ బిగ్ బాస్ షో అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహించేలా ఉందని, సెన్సార్ షిప్ లేకుండా షో ప్రసారం చేస్తున్నారని తెలిపారు.

నిబంధనల ప్రకారం అశ్లీలత ఉన్న కార్యక్రమాలను రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య మాత్రమే ప్రసారం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోర్టుకు నివేదించారు. కార్యక్రమంలో పాల్గొనే మహిళలకు గర్భ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, ఆ మహిళలతో ఇతరులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రదర్శిస్తున్న అశ్లీలతను వివరించేందుకు న్యాయవాది వాడుతున్న భాషపై ధర్మాసనం ఈ సందర్భంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. కాగా, వ్యాజ్యంలో సినీ నటుడు నాగార్జున ప్రతివాదిగా ఉన్నారని, ఆయన ఇప్పటి వరకు వకాలత్ వేయలేదని పిటిషన్ తరపు న్యాయవాది తెలిపారు. స్టార్ ఇండియా తరఫున సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి వాదనలను వినిపించారు. ఈ సందర్భంగా ఆయన వాదిస్తూ టీవీ ప్రసారాల్లో అశ్లీలతపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఉందని వెల్లడించారు. కేబుల్ టీవీ నెట్వర్క్ చట్టం ప్రకారం ఫిర్యాదులను పరిశీలించేందుకు మూడు అంచల వ్యవస్థ ఉందని పేర్కొన్నారు. చట్ట నిబంధనలకు లోబడే కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అశ్లీలతపై పిటిషినర్ ఎలాంటి ఆధారాలను కోర్టు ముందు ఉంచలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన న్యాయమూర్తుల దృష్టికి తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలను విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం బిగ్ బాస్ 8 సీజన్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కోర్టులో దీనిపై కేసు వేయడం, వాదనలు జరగడంతో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది. కోర్టు బిగ్ బాస్ షోకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే ఏం జరుగుతుంది అన్న చర్చ అభిమానుల్లో జోరుగా జరుగుతోంది. చూడాలి కోర్టు షో నిర్వహణకు సంబంధించి ఎటువంటి తీర్పును వెలువరిస్తుందో.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్